ఆమె బయోపిక్ కూడా వచ్చేస్తోందబ్బా..

ఆమె బయోపిక్ కూడా వచ్చేస్తోందబ్బా..

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతటా బయోపిక్‌ ఫీవర్ నడుస్తోంది. హిందీ.. తెలుగు.. తమిళం అని భాషా భేదం లేకుండా అన్ని చోట్లా బయోపిక్స్ తయారవుతున్నాయి. తెలుగులో సావిత్రి కథతో తెరకెక్కిన‘మహానటి’ పెద్ద విజయం సాధించడం ఇక్కడ బయోపిక్‌లకు మంచి ఊపు తెచ్చింది. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్స్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.


మరోవైపు ఇక్కడి ప్రముఖ క్రీడాకారుల బయోపిక్స్ కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ జాబితాలో గోపీచంద్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు, సానియా మీర్జా లాంటి వాళ్ల పేర్లు ఉన్నాయి. వీరి బయోపిక్స్ దిశగా చర్చలు నడుస్తున్నాయి. గోపీచంద్ బయోపిక్ త్వరలోనే మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈలోపు మరో స్పోర్స్ట్ పర్సన్ బయోపిక్ గురించి వార్త బయటికి వచ్చింది. ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్లేయర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మిథాలీ రాజ్ కథను కూడా వెండితెర మీదికి తేబోతున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా మిథాలీనే వెల్లడించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘వయాకామ్ 18’ తన సినిమా తీయడానికి ముందుకొచ్చినట్లు మిథాలీ చెప్పింది. తన పాత్రను ప్రియాంక చోప్రా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని ఆమె అంది. ప్రియాంక ఇంతకుముందు మేరీకోమ్ జీవిత కథతో తీసిన సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఐతే సినిమాల గురించి తనకు తెలిసింది తక్కువ కాబట్టి ప్రియాంకే చేయాలని తాను కచ్చితంగా చెప్పలేనని మిథాలీ అంది. తన సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆమె చెప్పింది. మరి మిథాలీ పాత్రను ఆమె కోరుకున్నట్లే ప్రియాంక చేస్తుందా లేదంటే ఆ పాత్రకు ఎవరు ఓకే అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు