చిన్న సినిమానే లీడరయ్యేలా ఉందే..

చిన్న సినిమానే లీడరయ్యేలా ఉందే..

గత వారాంతంలో వచ్చిన రెండు సినిమాలకూ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఈ వారాంతంలో ఒకటికి మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. ఇందులో వేటికవే భిన్నమైన సినిమాలు. మామూలుగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న ‘విజేత’ మీదో.. తమిళ కథానాయకుడు కార్తి నటించిన డబ్బింగ్ సినిమా ‘చినబాబు’ మీదో ఎక్కువ ఫోకస్ ఉండాలి.

కానీ వీటితో పోలిస్తే అందరూ కొత్తవాళ్లు కలిసి చేసిన ‘ఆర్ఎక్స్‌ 100’ మీదే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి కనిపిస్తుండటం విశేషం. ఇలా ముక్కూ ముఖం తెలియని వాళ్లు చేసిన సినిమాల్ని జనాలు అంతగా పట్టించుకోరు. కానీ ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తేగలిగింది. ఇలాంటి మ్యాజిక్ నూటికి ఒక సినిమాకు మాత్రమే జరుగుతుంది.

‘అర్జున్ రెడ్డి’ తరహాలో రా అండ్ బోల్డ్‌గా కనిపించిన ‘ఆర్ఎక్స్ 100’ ఆ సినిమా తరహాలోనే ట్రెండ్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ సినిమా గురించి దాని దర్శకుడు అజయ్ భూపతి (వర్మ శిష్యుడు), హీరో కార్తికేయ చాలా పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చేశారు. కొత్తదనంతో కూడుకున్న సినిమాలు నచ్చని వాళ్లు తమ సినిమాకు రావొద్దని దర్శకుడు అంటే.. ఇలాంటి సినిమా 50 ఏళ్లకు ఓసారి మాత్రమే వస్తుందని హీరో ప్రకటించేశాడు.

ఇది ఆత్మవిశ్వాసమా.. అతి విశ్వాసమా అన్నది అర్థం కావడం లేదు. ఐతే ప్రచారం కోసమే అన్నారో ఏంటో కానీ.. సినిమాకు బజ్ అయితే బాగా ఉంది. ఇలాంటి సినిమాలు అమెరికాలో విడుదల కావడమే కష్టం అంటే.. దీన్ని ఓ మోస్తరు స్థాయిలో రిలీజ్ చేస్తూ ముందు రోజు ప్రిమియర్లు కూడా వేస్తుండటం విశేషం. మొత్తానికి ఈ వారానికి క్రౌడ్ పుల్లర్ అయితే ‘ఆర్ఎక్స్ 100’ అనే చెప్పాలి. మరి ఈ చిత్రం అంచనాల్ని ఏమేరకు అందుకుంటుందో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు