సుక్కుని చరణ్.. చరణ్‌ను సుక్కు..

సుక్కుని చరణ్.. చరణ్‌ను సుక్కు..

రంగస్థలం.. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న చిత్రం. రెండు మూడు వారాలకే సినిమాల రన్ పూర్తయిపోతున్న ఈ రోజుల్లో 15 కేంద్రాల్లో ఏకంగా వంద రోజులు ఆడిన సినిమా. రూ.125 కోట్ల షేర్‌తో నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కట్టిన చిత్రం. ఈ చిత్రం ఇటు రామ్ చరణ్‌ కెరీర్లో.. అటు సుకుమార్ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఆకాశానికెత్తేసుకున్నారు. ‘రంగస్థలం’ శత దినోత్సవ వేడుకల్లో వీరు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు.

చరణ్ మాట్లాడుతూ.. సుకుమార్ ఎప్పుడైతే పెన్ను పట్టాడో ‘రంగస్థలం’ అనే గొప్ప సినిమా అప్పుడే రెడీ అయిపోయిందన్నాడు. ఇలాంటి సినిమాను తనకు అందించినందుకు తాను సుకుమార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. సుకుమార్ ఆలోచన వల్లే తాను అయినా.. దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు అయినా.. మిగతా వాళ్లయినా ఇంత కష్టపడి పని చేశామని.. ఎంతోమంది కష్టంతోనే ‘రంగస్థలం’ వంద రోజుల వరకు వెళ్లినప్పటికీ.. ఈ సినిమా ఆలోచన మాత్రం సుకుమార్‌తోనే మొదలైందని చరణ్ చెప్పాడు.

ఇక సుకుమార్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ ‘రంగస్థలం’ కథను ఒప్పుకోవడం వల్లే ఇంత గొప్ప సినిమా తయారైందన్నాడు. అతను ఈ కథను కాదని ఉంటే.. తాను మరో కథ చెప్పేవాడినన్నాడు. చిట్టిబాబు పాత్రలో చరణ్ జీవించాడని చెప్పాడు. చరణ్‌తో పని చేయడంలో గొప్ప కిక్కు ఉందని.. అతడితో మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉందని.. చరణ్‌తో విరామాన్ని తట్టుకోలేకపోతున్నానని సుకుమార్ తెలిపాడు. మళ్లీ తామిద్దరం ఒక మంచి సినిమాతో కలుస్తామని సుకుమార్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు