నటుడిగా మారిన స్టార్ లిరిసిస్ట్

నటుడిగా మారిన స్టార్ లిరిసిస్ట్

అనంత శ్రీరామ్.. పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు దశాబ్దంన్నరంగా టాలీవుడ్లో ప్రముఖ లిరిసిస్టుగా కొనసాగుతున్నాడు. అతడిని ఈ తరం సీతారామశాస్త్రి అంటారు. చిన్న వయసులోనే ఎంతో పరిణతి సాధించి చక్కటి సాహిత్యంతో గొప్ప పేరు సంపాదించాడు అనంత్. ఇప్పటికే కొన్ని వందల పాటలతో సత్తా చాటుకున్న అనంత్.. తాజాగా ‘సాక్ష్యం’ సినిమా కోసం 12 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఒక అద్భుతమైన పాట రాశాడు. పంచభూతాల మీద అతను రాసిన ఈ పాట ఆడియోకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. నిన్ననే రిలీజైన ఈ ఆడియోలో ఈ పాట స్టాండ్ ఔట్‌గా నిలిచింది. విశేషం ఏంటంటే.. అనంత శ్రీరామ్ ఈ సినిమాలో ఒక పాత్ర కూడా పోషించాడు. అతను తెరంగేట్రం చేస్తున్నది ఈ సినిమాతోనే.

తన పాట తాలూకు కాన్సెప్ట్ నరేట్ చేసే పాత్రే అట అది. ‘సాక్ష్యం’ ట్రైలర్లోనూ అనంత శ్రీరామ్ వాయిస్ వినిపిస్తుంది. సినిమాలో అతను రాసిన పాట బిట్లు బిట్లుగా వస్తుందట. పంచ భూతాల గురించి వివరించే పాట అది. ఆ పాట గురించి ఆడియో వేడుకలో సుదీర్ఘ ప్రసంగం చేశాడు అనంత్. ఈ వేడుకలో అతడి ప్రసంగమే హైలైట్ అని చెప్పాలి. పంచభూతాల ప్రాధాన్యం గురించి పాటలో రాసిన పంక్తుల్ని ఉదహరిస్తూ చాలా గొప్ప విషయాలు చెప్పాడతను. ‘‘ఇలాంటి బలమైన పాటను నా లాంటి బక్కోడితో రాయించినందుకు.. ఇలాంటి అద్భుతమైన పాటను నా లాంటి అర్భకుడితో రాయించినందుకు..’’ అంటూ చిత్ర బృందంలో ఒక్కొక్కరికి అతను కృతజ్ఞతలు చెప్పిన తీరుకు ఆడిటోరియం హోరెత్తింది. ఈ సినిమా చివర్లో థియేటర్లలోని ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొడతారని అతను జోస్యం చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు