కొంప ముంచుతోన్న నాగచైతన్య స్పీడు

కొంప ముంచుతోన్న నాగచైతన్య స్పీడు

నాగ చైతన్య మిగతా హీరోల కంటే వేగంగా సినిమాలు చేసేస్తుంటాడు. ఎప్పుడూ మూడు, నాలుగు సినిమాలు క్యూలో పెట్టి ఫలితంతో పని లేకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. ఏదైనా సినిమా షూటింగ్‌ కాస్త ఆలస్యం అయితే మధ్యలో మరో చిత్రానికి డేట్స్‌ ఇచ్చేస్తుంటాడు. దీంతో కొన్నిసార్లు ఒకే సమయానికి రెండు చిత్రాలు రిలీజ్‌ అయ్యే పరిస్థితి వస్తోంది.

ప్రస్తుతం అలాంటి సిట్యువేషన్‌లోనే పడ్డాయి సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు. సవ్యసాచి మే లేదా జూన్‌కి రావాల్సిన సినిమా. కానీ షూటింగ్‌ డిలే అవడంతో ఆగస్టుకి రిలీజయ్యేట్టుంది. మరోవైపు శైలజారెడ్డి అల్లుడు మొదట్నుంచీ ఆగస్టు నెలాఖరులో విడుదలకి షెడ్యూల్‌ వేసుకుంది. సవ్యసాచి షూటింగ్‌ ఆలస్యమవడంతో శైలజారెడ్డి అల్లుడుని చైతన్య చాలా వరకు పూర్తి చేసేసాడు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకే టైమ్‌కి రిలీజయ్యే సిట్యువేషన్‌ వచ్చింది.

చైతన్య రేంజ్‌ హీరో చిత్రాలు ఒకే సమయంలో రావడం వల్ల రెండిటికీ ఇబ్బందే. కానీ ఆయా చిత్రాల నిర్మాతల మధ్య రాజీ కుదరకపోవడం వల్ల ఇప్పుడు వీటిలో ఏది ముందు రావాలి, ఏది వాయిదా పడాలి అనేది సమస్యగా మారింది. దీనికి పరిష్కారం తన వద్ద లేకపోవడంతో నాగార్జునని పెద్ద మనిషిగా నిలబెట్టి తీర్పు చెప్పించాలని చైతన్య చూస్తున్నాడట. అయితే దీనంతటికీ అసలు బ్రేక్‌ తీసుకోకుండా పని చేస్తోన్న చైతన్యే పరోక్షంగా కారణం.

ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత మరో సినిమా అన్నట్టుగా చేసుకుంటే ఎలాంటి సమస్య వుండదు కానీ ప్యారలల్‌గా రెండు సినిమాలు చేయడం ఎప్పుడూ తలనొప్పే. ఇకనైనా తన సినిమాల మధ్య తగిన గ్యాప్‌ వుండేలా చూసుకోకపోతే ఇలాంటి తలపోట్లు మళ్లీ మళ్లీ వచ్చినా ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు