రెండో ట్రైలర్లోనూ విషయముందే

రెండో ట్రైలర్లోనూ విషయముందే

కొన్నిసార్లు ముక్కూ మొహం తెలియని వాళ్లు చేసిన సినిమాలకు కూడా అనూహ్యంగా క్రేజ్ వచ్చేస్తుంటుంది. దాసరి మారుతి తీసిన తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ అప్పట్లో మంచి హైప్ మధ్య రిలీజైంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ సంగతీ తెలిసిందే. ఒక స్టార్ హీరో సినిమా లాగా దానికి హైప్ వచ్చింది. ఇప్పుడు ‘ఆర్ఎక్స్ 100’ అనే చిన్న సినిమాకు కూడా అలాంటి క్రేజే కనిపిస్తోంది.

రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ భూపతి అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. కార్తికేయ అనే కొత్త కుర్రాడు కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్ర ప్రోమోలు జనాల్లో ఒక క్యూరియాసిటీ తెచ్చాయి. ముఖ్యంగా దీని ట్రైలర్ అమితాసక్తి రేకెత్తించింది. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ను పదుల లక్షల మంది చూశారు. కొంచెం కొత్తగా.. బోల్డ్‌గా కనిపించిన ఈ ట్రైలర్ సినిమాలో విషయముందన్న సంకేతాలిచ్చింది.


ఐతే ొక ట్రైలర్ కట్ చేయడం ఈజీనే.. సినిమా అంతటా అలా నడిపించడం కష్టం అన్నారు జనాలు. ఐతే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మరో ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. అది కూడా తొలి ట్రైలర్ తరహాలోనే ఇంటెన్స్‌గా ఉండి ఆకట్టుకుంటోంది. లవ్ స్టోరీతో పాటు యాక్షన్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా తీసినట్లున్నాడు అజయ్ భూపతి. ప్రతి ఫ్రేమ్‌లోనూ తీవ్రత కనిపిస్తోంది.

కొన్నేళ్లు వెనక్కి వెళ్లి అప్పటి నేపథ్యాన్ని చాలా ‘రా’గా చూపించినట్లున్నాడు దర్శకుడు. తొలి ట్రైలర్ లాగే ఇందులోనూ రొమాంటిక్ సన్నివేశాలు చాలా గాఢంగా ఉండి యువతో సెగలు రేకెత్తిస్తున్నాయి. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా కనిపిస్తున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్‌ చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. ఈ సినిమా మరో ‘అర్జున్ రెడ్డి’ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. హీరో కార్తికేయ సొంత నిర్మాణ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించింది. జులై 12న ‘ఆర్ఎక్స్‌ 100’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు