నాగ్-నాని.. మీడియా గెలిచింది

నాగ్-నాని.. మీడియా గెలిచింది

క్రేజీ కాంబినేషన్లో కొత్త సినిమా రెడీ అవుతోందంటూ.. వెంటనే రూమర్లు మొదలైపోతాయి. ఆ సినిమా టైటిల్ గురించి.. దాని కథ గురించి.. అందులోని పాత్రల గురించి మీడియాలో ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. చిత్ర బృందం నుంచి కొంత వరకు సమాచారం బయటికి లాగి.. సొంత కబుర్లు జోడించి ప్రచారాలు సాగిస్తుంటారు మీడియా వాళ్లు.

ఈ విషయంలో మీడియా వాళ్లను తప్పుదోవ పట్టించే వాళ్లు కూడా లేకపోలేదు. కాబట్టే మీడియాలో వచ్చేదంతా వాస్తవం కాదు. చాలా సార్లు వీళ్ల అంచనాలు తప్పుతుంటాయి. ఐతే అక్కినేని నాగార్జున-నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ విషయంలో మీడియా అంచనాలు వంద శాతం నిజమయ్యాయి. దీని గురించి జరిగిన ప్రచారమంతా నిజమే అని తేలింది.

ఈ చిత్రానికి ‘దేవదాస్’ అనే టైటిల్ పెట్టబోతున్నారని కొన్ని రోజుల ముందే మీడియా రివీల్ చేసింది. అందులో నాగ్ దేవ పాత్రలో కనిపిస్తాడని.. నానిది దాస్ క్యారెక్టర్ అని ప్రచారం జరిగింది. ఐతే ఏఎన్నార్ క్లాసిక్ సినిమా టైటిల్‌‌ను ఇలా వాడతారా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తలే నిజమని తేలింది. టైటిల్‌తో పాటు క్యారెక్టర్ల గురించి కూడా ఇప్పుడు రివీల్ చేశారు. మరోవైపు ఇందులో నాగార్జున డాన్ పాత్రలో కనిపిస్తాడని.. నాని డాక్టర్ అని అన్నారు.

టైటిల్ లోగోలో ఒకవైపు గన్.. మరోవైపు స్టెతస్కోప్ కనిపించడాన్ని బట్టి ఆ సంగతి కూడా నిజమే అని తేలింది. మొత్తానికి ఈ సినిమా విషయంలో మీడియా అంచనాల్ని నిజమయ్యాయి. ‘భలేమంచి రోజు’.. ‘శమంతక మణి’ లాంటి వైరైటీ సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు