ఆగస్టు అదిరిపోయేలా ఉందిగా..

ఆగస్టు అదిరిపోయేలా ఉందిగా..

గత కొన్నేళ్లలో సంక్రాంతికి ఉన్నంత సందడి సమ్మర్లో లేదు. గత ఏడాది ‘బాహుబలి: ది కంక్లూజన్’ రాబట్టి బాక్సాఫీస్ వేడెక్కింది కానీ.. దాన్ని మినహాయిస్తే వేసవి వినోదం ఏమంత గొప్పగా లేదు. అంతకుముందు రెండేళ్లు కూడా వేసవి వినోదం ఆశించిన స్థాయిలో లేదు. కానీ ఈ ఏడాది మాత్రం భిన్నమైన దృశ్యం కనిపించింది. సంక్రాంతి తుస్సుమనిపించింది. సమ్మర్ అదిరిపోయింది.

‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’, ‘మహానటి’ లాంటి సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. కానీ సమ్మర్ ముగియగానే బాక్సాఫీస్ డల్లుగా మారిపోయింది. ముఖ్యంగా జూన్ నెలలో థియేటర్లు వెలవెలబోయాయి. ఈ నెలలో నిఖార్సయిన హిట్టు ఒక్కటీ పడలేదు. జులై నెల కూడా ఏమంత ఎగ్జైటింగ్‌గా కనిపించడం లేదు. చిన్న-మీడియం రేంజ్ సినిమాలే ఉన్నాయి ఈ నెలంతా. వీటిపై అంచనాలు కూడా తక్కువే.

కానీ ఆగస్టు నెలలో మళ్లీ బాక్సాఫీస్ వేడి రాజుకోబోతోంది. మంచి క్రేజ్ ఉన్న సినిమాలు వరుసకట్టబోతున్నాయి ఆ నెలలో. ముందుగా అడివి శేష్ ‘గూఢచారి’ ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక 9వ తేదీన దిల్ రాజు సంస్థ నుంచి ‘శ్రీనివాసకళ్యాణం’ రాబోతోంది. దీనిపైనా అంచనాలు బాగున్నాయి. ఆగస్టు 15న విజయ్ దేవరకొండ సినిమా ‘గీత గోవిందం’ షెడ్యూల్ అయి ఉంది. దానికీ క్రేజ్ ఉంది. అదే వీకెండ్లో అక్కినేని నాగచైతన్య సినిమా ‘సవ్యసాచి’ రాబోతోంది. దీనికీ మంచి హైప్ ఉంది.

అతడి మరో సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రం ఆ నెలాఖరుకు షెడ్యూల్ అయి ఉంది. ఇలా ఆగస్టు నెలకు ఫిక్సయిన ప్రతి సినిమా క్రేజ్ ఉన్నదే. ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకున్నదే. మరీ భారీ సినిమాలు లేకపోయినా.. మీడియం రేంజ్ సినిమాలతోనే బాక్సాఫీస్ కళకళలాడేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English