నయన్ మళ్లీ మెస్మరైజ్ చేసింది

నయన్ మళ్లీ మెస్మరైజ్ చేసింది

దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ తెచ్చిన హీరోయిన్లలో నయనతార ఒకరు. కొన్ని నెలల కిందటే విడుదలైన ‘కర్తవ్యం’ సినిమాలో నయన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తెలుగు ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ అయ్యారు. ఆ చిత్రం తమిళంలో చాలా పెద్ద హిట్టయింది. అంతకుముందు ‘మయూరి’ అనే హార్రర్ మూవీలోనూ అదరగొట్టింది నయన్. తాజాగా ఆమె ‘కోలమావు కోకిల’ అనే థ్రిల్లర్ మూవీలో నటించింది.

ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది తమిళనాట. నయన్ ఇందులో స్మగ్లర్ పాత్రలో నటించడం విశేషం. 25 కోట్ల విలువైన ఒక పౌడర్‌ను ఆమె ఒక చోటి నుంచి మరో చోటికి చేర్చాల్సి వస్తుంది. ఇందుకు ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయడం మొదలుపెడుతుంది.

భయం భయంగా.. ఏమీ తెలియని అమాయకురాలి లాగా కనిపిస్తుంది నయన్. ఆమెది పేద కుటుంబం. తల్లిదండ్రులు, ఒక చెల్లెలు ఉంటారు. వాళ్లతో పాటు నయన్‌ను ప్రేమించే ఒక కమెడియన్ కూడా వీళ్లకు తోడవుతాడు. వీళ్లంతా కలిసి ఒక వ్యాన్‌లో బయల్దేరతారు. ఈ క్రమంలో వాళ్లకు ఎదురయ్యే సంఘటనల నేపథ్యంలో సినిమా సాగుతుంది. నయన్‌ను ఫినిష్ చేయాలని విలన్లు అనుకుంటే ఆమె రివర్స్ తిరిగి.. తనలోని మరో యాంగిల్ చూపిస్తుంది. విలన్లకు షాకిస్తుంది. ట్రైలర్ చూస్తే సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా కనిపిస్తోంది.

నయన్ క్యారెక్టర్ చాలా టిపికల్‌గా అనిపిస్తోంది. ఆమె లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయనే చెప్పాలి. ట్రైలర్ చూస్తే సినిమా కచ్చితంగా హిట్టయ్యేలా కనిపిస్తోంది. ట్రైలర్‌కు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కూడా అదిరింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తెలుగులోకి కూడా అనువాదమయ్యే అవకాశాలున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు