బాహుబలి ప్రీక్వెల్ బడ్జెట్ అంతా?

బాహుబలి ప్రీక్వెల్ బడ్జెట్ అంతా?

‘బాహుబలి’ సినిమాకు ఎప్పుడో ఏడేళ్ల కిందట శ్రీకారం చుట్టారు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. రెండేళ్లలో ఒక భాగంగా సినిమా తీద్దామనుకుని దిగి.. ప్రి ప్రొడక్షన్ కోసమే ఏడాదికి పైగా కష్టపడి.. తర్వాత సినిమా మొదలుపెట్టి.. రెండు భాగాలుగా తీయాలనుకుని ఒక భాగాన్ని రెండేళ్ల పాటు తీసి.. అది రిలీజైన రెండేళ్లకు రెండో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చి.. విడుదల తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఆ సినిమా పనుల్లోనే మునిగిపోయి.. ఎట్టకేలకు ఈ మధ్యే ‘బాహుబలి’ ఛాయల నుంచి బయట పడ్డట్లుగా కనిపించారు ఈ నిర్మాతలు. అలాగని ‘బాహుబలి’కి వాళ్లేమీ పూర్తిగా దూరం కాలేదు. ‘బాహుబలి’ స్టయిల్లో ‘స్వర్ణఖడ్గం’ పేరుతో సీరియల్ చేస్తున్నారు. ఇటీవలే దాని ప్రసారం ఈటీవీలో మొదలైంది. మరోవైపు ‘బాహుబలి’ ప్రీక్వెల్ అంటూ డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌కు ఎ‘బాహుబలి’ నిర్మాతలు ఒక వెబ్ సిరీస్ చేస్తుండటం విశేషం.

వెబ్ సిరీస్ అంటే ఏదో ఆషామాషీగా కాదు. సినిమా స్టయిల్లోనే భారీగా చేస్తారట. మూడు భాగాలుగా రాబోయే ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ వింటే దిమ్మదిరిగిపోతోంది. ఏకంగా రూ.350 కోట్లు ఈ ప్రాజెక్టు మీద పెట్టుబడిగా పెట్టడానికి నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చిందట. ఒక భాగానికి ‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్టా తీయబోతున్నాడు. ఇంకో తెలుగు దర్శకుడితో పాటు హిందీ డైరెక్టర్‌నూ తీసుకోబోతున్నారట. ఈ ప్రాజెక్టు మొత్తం ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి పర్యవేక్షణలో సాగుతుందని అంటున్నారు. ఐతే వెబ్ సిరీస్ మీద ఏకంగా రూ.350 కోట్ల పెట్టుబడి అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. హాలీవుడ్లో ఇలా భారీ బడ్జెట్లో ‘గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్‌ తీసి మంచి ఫలితాన్నందుకున్నారు. కానీ మన దగ్గర వెబ్ సిరీస్ అంటే తక్కువ ఖర్చుతో లాగించేసే వ్యవహారాలే నడుస్తున్నాయి. మరి ‘బాహుబలి’ సినిమా మార్కెట్ లెక్కల్ని మార్చినట్లే దీని ప్రీక్వెల్‌ వెబ్ సిరీస్ మార్కెట్‌ను మారుస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు