తొలి సినిమా వచ్చిన 22 ఏళ్లకు...

తొలి సినిమా వచ్చిన 22 ఏళ్లకు...

సినీ పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాల నుంచి అమ్మాయిలు హీరోయిన్లు కావడం అరుదు. ఈ మధ్య మంచు లక్ష్మి, కొణిదెల నిహారిక లాంటి వాళ్లు బంధనాలు తెంచుకుని హీరోయిన్లయ్యారు. తమకు నచ్చినట్లుగా సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్నారు. ఈ కోవలోనే రాజశేఖర్ తనయురాలు శివాని కూడా హీరోయిన్‌ అయింది. ఐతే వీళ్ల కంటే చాలా ముందుగానే ఓ పెద్దింటి అమ్మాయి కథానాయిక అయింది. ఆమే.. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో సుప్రియనే హీరోయిన్. ఓ మోస్తరు ఫలితాన్నందుకున్న ఆ సినిమా తర్వాత సుప్రియ మళ్లీ ఇంకో సినిమాలో నటించలేదు.

సుప్రియకు అవకాశాలు రాలేదా.. లేక సినిమాల్లో కొనసాగడం ఆమెకే ఇష్టం లేదా అన్నది తెలియలేదు కానీ.. మళ్లీ తెరమీద అయితే కనిపించలేదామె. అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు.. నాగార్జున నిర్మించే సినిమాల పనులు చూసుకుంటూ తెర వెనుకే ఉండిపోయింది సుప్రియ. ఐతే  తొలి సినిమా వచ్చిన 22 ఏళ్లకు మళ్లీ సుప్రియ మళ్లీ వెండితెరపై కనిపించబోతుండటం విశేషం.

‘క్షణం’ తర్వాత అడివి శేష్ నటిస్తున్న ‘గూఢచారి’లో సుప్రియ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. నిన్న రిలీజైన ఈ చిత్ర టీజర్లో సుప్రియ కనిపించింది. ఆమెది సినిమాలో ముఖ్య పాత్రే అంటున్నారు. కథానాయికకు దీటుగా ఆమె క్యారెక్టర్ ఉంటుందట. తొలి సినిమాతో పోలిస్తే సుప్రియ లుక్ చాలా మారిపోయింది. ఏదో ఆషామాషీ క్యారెక్టర్ అయితే ఆమె నటించేందుకు ఒప్పుకుని ఉండదు. కాబట్టి సుప్రియ ఏదో ప్రత్యేకత చూపిస్తుందనే భావించాలి. మరి ఆమె రీఎంట్రీలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు