రంగస్థలం.. ఈ రికార్డు అద్భుతమే

రంగస్థలం.. ఈ రికార్డు అద్భుతమే

రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’పై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. ఈ సినిమా కమర్షియల్‌గా ఏమేరకు సక్సెస్ అవుతుందో అనే విషయంలో అనేక సందేహలు నెలకొన్నాయి విడుదలకు ముందు. సుకుమార్ గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా వర్కవుటయ్యే సినిమాలు పెద్దగా తీయలేదు. మహేష్ బాబుతో ఆయన తీసిన ‘1 నేనొక్కడినే’ పెద్ద డిజాస్టరైంది. జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన ‘నాన్నకు ప్రేమతో’ పెట్టుబడిని మాత్రమే వెనక్కి తెచ్చింది. పెద్దగా లాభాలివ్వలేదు.

ఈ నేపథ్యంలో ‘రంగస్థలం’ సంగతేమవుతుందో అని చాలామంది సందేహంగా చూశారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు రావాలన్నా ‘మగధీర’ కలెక్షన్లను దాటాల్సి ఉండటంతో బయ్యర్లలో ఆందోళన నెలకొంది. కానీ మార్చి నెలాఖర్లో విడుదలైన ఈ చిత్రం.. అనూహ్యమైన వసూళ్లతో సాగిపోయింది. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ రికార్డుల్ని బద్దలు కొట్టడమే పెద్ద విషయం అనుకుంటే.. దాని మీద ఇంకో 20 కోట్లు అదనంగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. విడుదలైన ఐదారు వారాల తర్వాత కూడా మంచి వసూళ్లతో సాగిపోవడం అనూహ్యమే. విశేషం ఏంటంటే.. 50 రోజుల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కేంద్రాల్లో ఈ సినిమా ఇంకా ఆడుతోంది. వంద రోజుల సెంటర్ల కోసం బలవంతంగా ఆడిస్తున్న వ్యవహారం కాదిది.

ఇంకా చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తుండటంతో సినిమాను నడిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 31 థియేటర్లలో ఒక్కో దాంట్లో ఈ చిత్రం కోటి అంత కంటే ఎక్కువ గ్రాస్ రాబట్టడం విశేషం. ఇది నిజంగా అద్భుతమైన రికార్డే. అన్నింట్లోకి అత్యధికంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో ఏకంగా రూ.1.7 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందీ చిత్రం. ఇంకో రెండు రోజుల్లోనే అక్కడ ‘రంగస్థలం’ వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోబోతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు