కళ్యాణ్ రామ్ కాదు.. అతనే నిర్మాత

కళ్యాణ్ రామ్ కాదు.. అతనే నిర్మాత

కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువ సొంత బేనర్లోనే సినిమాలు చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. అతడి కెరీర్లో పెద్ద హిట్లుగా నిలిచిన ‘అతనొక్కడే’, ‘పటాస్’ సినిమాలు సొంత బేనర్లో తెరకెక్కినవే. అలాగే సొంత సంస్థలో ఎన్నో డిజాస్టర్లు కూడా తిన్నాడు. ఐతే ఇటీవలే ఈ నందమూరి హీరో తన పీఆర్వో మహేష్ కోనేరు నిర్మాణంలో ‘నా నువ్వే’ అనే సినిమా చేశాడు.

ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ వెంటనే కళ్యాణ్ రామ్ అతడి ప్రొడక్షన్లోనే మరో సినిమా చేస్తుండటం విశేషం. సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో కొన్నాల్ల కిందటే కళ్యాణ్ రామ్ ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది తన సొంత బేనర్లో చేస్తున్నట్లుగా చెప్పుకున్నాడు కళ్యాణ్ రామ్.

కానీ బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయగా అందులో నిర్మాతగా మహేష్ కోనేరు పేరే ఉంది. ‘నా నువ్వే’కు సమర్పకుడిగా వ్యవహరించిన మహేష్.. ఈ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా మారడం విశేషం. ఈ చిత్రం భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్‌ అయితే చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కళ్యాణ్ రామ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. పోస్టర్ బ్యాగ్రౌండ్ డిజైనింగ్ కూడా క్యూరియాసిటీ పెంచేలా ఉంది.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నివేథా థామస్, షాలిని పాండే నటిస్తున్నారు. ‘పటాస్’ తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన ‘షేర్’, ‘ఇజం’, ‘ఎమ్మెల్యే’, ‘నా నువ్వే’ ఫ్లాపైన నేపథ్యంలో గుహన్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు