భారీ బడ్జెట్ పురుగు ఆయన్నీ కుట్టేసింది

భారీ బడ్జెట్ పురుగు ఆయన్నీ కుట్టేసింది

నిర్మాతలుగా పెద్దగా అనుభవం లేని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి‘బాహుబలి’ మెగా సినిమాను నిర్మించి ఔరా అనిపించారు. రాజమౌళి ఉన్నాడన్న ధైర్యం వాళ్లని ఆ సాహసానికి పురిగొల్పి ఉండొచ్చు. ఐతే ఆ నిర్మాతల్ని చూసి టాలీవుడ్ బడా నిర్మాతలందరికీ కన్ను కుట్టి ఉంటుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలందరూ చిన్న స్థాయి సినిమాలకు పరిమితం అవుతుంటే.. వీళ్లు మాత్రం ఇండియాలోనే ఎవ్వరూ చేయని సాహసం చేసేశారు.

దీంతో తాము కూడా అలాంటి భారీ సినిమా ఒకటి తీసి తమ పేరూ మార్మోగేలా చేసుకోవాలని అగ్ర నిర్మాతలకు కోరిక పుట్టింది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ 500 కోట్ల రూపాయలతో రామాయణం తీయబోతున్నట్లు ప్రకటించారు. అదెప్పుడు పట్టాలెక్కుతుందో ఏమో కానీ.. అరవింద్‌కైతే అలాంటి ఓ సినిమా తీయాలని మాత్రం ఫిక్సయ్యారు.

మరోవైపు యువి క్రియేషన్స్ వాళ్లు ప్రభాస్‌తో దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్లో ‘సాహో’ తీస్తున్నారు. డీవీవీ దానయ్య ఏమో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్‌లతో రూ.250 కోట్లతో మల్టీస్టారర్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో అగ్ర నిర్మాత సురేష్ బాబు మాత్రం తమ సంస్థలో ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని భారీ బడ్జెట్లో చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అదే.. హిరణ్యకశిప. గుణశేఖర్ డైరెక్షన్లో ఈ సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు సురేష్ బాబు ఇటీవలే కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర బడ్జెట్ రూ.180 కోట్లని తాజాగా సమచారం బయటికి వచ్చింది.

‘భక్త ప్రహ్లాద’లో కేవలం హిరణ్యకశిపుని నెగెటివ్ కోణాన్ని మాత్రమే చూపించగా.. రావణాసురుడి తరహా విలక్షణమైన హిరణ్యకశిపుని వ్యక్తిత్వాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నారట. ఆయనలోని అనేక కోణాల్ని చూపిస్తారట. ఖర్చుకు వెనుకాడకుండా తమ సంస్థ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయేలా ఈ సినిమాను నిర్మించాలని సురేష్ బాబు ఫిక్సయ్యారట. గీచి గీచి ఖర్చు పెడతాడని పేరున్న సురేష్ బాబు.. ఏకంగా రూ.180 కోట్లతో సినిమా తీయడానికి రెడీ అయిపోవడం ఆశ్చర్యమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు