150 కోట్లొచ్చాయి.. అయినా డిజాస్టరే

150 కోట్లొచ్చాయి.. అయినా డిజాస్టరే

ఒక దక్షిణాది సినిమా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉంటుందని అనుకుంటారు. కానీ అంత వసూళ్లు సాధించిన సినిమాను డిజాస్టర్ అనాల్సి వస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 150 కోట్లన్నవి వేరే హీరోలకు పెద్ద ఫిగర్ కావచ్చు కానీ.. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మాత్రం కాదు.

ఆయన సినిమాలు ఆ రేంజిలో వసూళ్లు రాబడితే వాటిని హిట్ కేటగిరీలోకి వేయలేం. డిజాస్టర్ అనే అనాల్సి ఉంటుంది. ‘కాలా’ పరిస్థితి కూడా అంతే.  గత నెల 7న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఒక్క తమిళనాట మాత్రమే ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లతో పెద్ద డిజాస్టర్ అయింది.

ఐతే ఈ చిత్ర ఓవరాల్ గ్రాస్ వసూళ్లు తాజాగా రూ.150 కోట్ల మార్కును దాటాయి. ‘రోబో’.. ‘కబాలి’ తర్వాత ఈ ఘనత సాధించిన సినిమాగా ‘కాలా’ రికార్డులకెక్కింది. దక్షిణాదిన మరే హీరో కూడా ఇన్నిసార్లు రూ.150 కోట్ల గ్రాస్ మార్కును అందుకోలేదు. కానీ ఏం లాభం.. అంత వసూళ్లు రాబట్టి కూడా డిజాస్టర్‌గానే నిలిచిందీ చిత్రం. తమిళనాట మాత్రం బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడ్డారు కానీ.. మిగతా అన్ని చోట్లా భారీ నష్టాలు తప్పలేదు.

రజనీ గత సినిమా ‘కబాలి’ కూడా నిరాశ పరిచినప్పటికీ ఆ చిత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ద్వారా తెలుగులో రూ.25 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. కానీ ‘కాలా’కు ఫుల్ రన్లో కేవలం రూ.7.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. కేరళ, కర్ణాటక, నార్త్ ఇండియా, అమెరికా.. ఇలా పలు చోట్ల ‘కాలా’ భారీ నష్టాలు తెచ్చింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English