మహానటి.. చివరికి ఎంత?

మహానటి.. చివరికి ఎంత?

సావిత్రి కథతో సినిమా అన్నపుడు దాన్ని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరిస్తారో అన్న సందేహాలు చాలామందిలో కలిగాయి. కానీ సిన్సియర్‌గా సినిమా తీసి ప్రేక్షకుల మెప్పు పొందింది చిత్ర బృందం. ఒక స్టార్ హీరో నటించిన మాస్ సినిమా స్థాయిలో ఇది ఆదరణ పొందింది. తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లతో మొదలై.. ఆ తర్వాత హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది.

ఒకట్రెండు వారాంతాలకే సినిమా కథ ముగిసిపోతున్న ఈ రోజుల్లో కొన్ని వారాల పాటు ఆడిన సినిమా ఇది. దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదొక కొత్త చరిత్రకు తెర తీసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.75 కోట్ల గ్రాస్.. రూ.42.5 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ‘రుద్రమదేవి’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిదే.

తెలుగులోనే ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం. తమిళంలో తక్కువ మొత్తానికే హక్కులు అమ్మగా అక్కడ కూడా పది కోట్లకు పైనే షేర్ సాధించింది. ఈ చిత్ర బడ్జెట్ రూ.25-30 కోట్ల మధ్య అని సమాచారం. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరక్కపోవడంతో చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుని మంచి లాభాలు అందుకుంది వైజయంతీ మూవీస్.

ఇక శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలోనూ దత్ కుటుంబానికి బాగానే ఆదాయం ముట్టింది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత దత్ ఫ్యామిలీ పేరుకు పేరు, లాభాలకు లాభాలు అందుకుని ఇండస్ట్రీలో తమ ఉనికిని మళ్లీ ఘనంగా చాటింది. ఈ ఊపులో వరుసగా పెద్ద సినిమాలు తీసే ప్రయత్నాల్లో ఉంది దత్ కుటుంబం. నాగ్-నాని మల్టీస్టారర్‌తో పాటు మహేష్ కొత్త సినిమాను కూడా వైజయంతీ మూవీసే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు