కాస్టింగ్ కౌచ్‌పై సురేష్ బాబు ఓపెన్‌గా..

కాస్టింగ్ కౌచ్‌పై సురేష్ బాబు ఓపెన్‌గా..

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌ గురించి కొన్ని నెలలుగా ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. ముఖ్యంగా ఇందులో శ్రీరెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ మీద సంచలన ఆరోపణలు చేయడం పెద్ద దుమారమే రేపింది. ఈ ఆరోపణలపై అభిరామ్ కానీ.. సురేష్ కానీ.. దగ్గుబాటి ఫ్యామిలీలో ఇంకెవ్వరు కానీ స్పందించలేదు.
కొన్ని నెలల పాటు సురేష్ అసలు మీడియా వైపే చూడలేదు. ఐతే తన నిర్మాణంలో వచ్చిన కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన సురేష్‌.. శ్రీరెడ్డి ఆరోపణలు మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కోక తప్పలేదు. ఐతే ఈ గొడవ తన కుటుంబ వ్యవహారమని.. దీనిపై తాను స్పందించబోనని తేల్చేశారాయన.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మొత్తంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి సురేష్ మాట్లాడారు. ఇది పరిష్కరించలేని సమస్య అని ఆయన ఓపెన్‌‌గా చెప్పేశారు. ‘‘సినీ పరిశ్రమలోనే కాదు.. ప్రతి చోటా ఈ సమస్య ఉంటుంది. నాకు తెలిసినంతవరకూ మన పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ సంఖ్యలో జరిగి ఉంటాయి. వాటినే పెద్దవిగా చూపుతున్నారు. ఇవి మానవ సంబంధిత సమస్యలు. వీటిని పరిష్కరించలేం’’ అని సురేష్ అన్నారు.

మానవజాతి పుట్టినప్పటి నుంచి సెక్స్ సమస్య ఉందని.. పురాణాలు, రాజుల కాలం నుంచి ఇది ఉందని.. దీన్ని కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే ఆపాదించడం సరి కాదని ఆయన అన్నారు. ఐతే  ఇండస్ట్రీకి చెడ్డపేరు తెచ్చేవారిని మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఒకరు చేసిన తప్పులకు ఇండస్ట్రీ మొత్తం బాధ్యత వహించబోదన్నారు. కొంతమంది మాత్రమే తప్పుడు దారిలో వెళ్తారని.. వాళ్లను మినహాయిస్తే ఎంతోమంది ప్రతిభావంతులు పరిశ్రమలో ఉన్నారని సురేష్ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు