తెలంగాణ మంత్రిగారికి కోపమొచ్చింది

తెలంగాణ మంత్రిగారికి కోపమొచ్చింది

కేసీఆర్ కేబినెట్లోని సీనియర్ మంత్రుల్లో ఒకరైన కడియం శ్రీహరి తీరు ఇటీవల వివాదాస్పదమవుతోంది. ఆయన చీటికీమాటికీ అందరిపైనా చిరాకుపడుతున్నారని వినిపిస్తోంది. తాజాగా బదిలీల విషయమై మాట్లాడేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నేతలపైనా ఆయన మండిపడ్డారట. ‘‘వాయిస్‌ ఎందుకు పెంచుతున్నావ్‌… నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు… మంత్రితో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో… ఎందుకు వాయిస్‌ పెంచి మాట్లాడుతున్నావు’’ అంటూ ఒక ఉపాధ్యాయ సంఘం నేతపై ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైర్‌ అయ్యారని చెప్తున్నారు.

    ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా టీచర్లు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లలో పొరపాట్లు, సాంకేతిక తప్పిదాలు జరిగాయని.. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మంత్రి కడియంను కోరాయి. ఎడిట్‌ ఆప్షన్‌ వ్యవహారంపై ఆయా సంఘాల నేతలతో చర్చించిన కడియం శ్రీహరి, అధికారులతో సమీక్షించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంతలోనే మరో ప్రధాన సంఘానికి చెందిన నేతలు కూడా కడియంను కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం స్వీకరించిన మంత్రి వారు పేర్కొన్న అంశాలను తెలుసుకున్నారు. ఆ సంఘం నేతలు కూడా ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని, దాంతోపాటు సీనియారిటీ లిస్టులో జరిగిన తప్పులను సరిచేయాలని కోరారు. దీనిపై స్పందించిన కడియం, ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వడానికి ఇబ్బంది లేదని, కానీ సీనియారిటీ లిస్టును సరిచేసి తిరిగి ప్రకటించడం అంటే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను మళ్లి మొదటి నుంచి ప్రారంభించడమేనని వివరించారు. అయితే, డీఈవోలు ఇష్టానుసారంగా వ్యవహరించి సీనియారిటీ లిస్టును తయారు చేశారని, వారు చేసిన తప్పులకు ఉపాధ్యాయులు ఎందుకు బలికావాలని, అందువల్ల సీనియారిటీ లిస్టు సరిచేయాలని సంబంధిత ఉపాధ్యాయ సంఘం నేత గట్టిగా వాదించడంతో మంత్రి ఆయనపై ఫైరయిపోయారని చెప్తున్నారు.

    మంత్రి అలా తీవ్రంగా హెచ్చరించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని గమనించిన ఇతర ఉపాధ్యాయ సంఘాల నేతలు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగినట్లు సమాచారం. అయితే.. ఆ తరువాత ఉపాధ్యాయులకు బదలీల్లో జరిగిన తప్పులను సరిచేసుకోవడం కోసం ఎడిట్‌ ఆప్షన్‌ కల్పించారు. కానీ సీనియారిటీ లిస్టులు మాత్రం సవరించలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English