సంపూ సినిమా సిద్ధమైందట

సంపూ సినిమా సిద్ధమైందట

కొన్నేళ్ల కిందట ‘హృదయ కాలేయం’ సినిమాతో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. ఆ ఊపులో ‘సింగం 123’, ‘వైరస్’ లాంటి కొన్ని సినిమాలేవో చేశాడు కానీ.. అవేవీ అతడికి మంచి ఫలితాన్నివ్వలేదు. తొలి సినిమాతో ఎంత వేగంగా పైకి లేచాడో.. అంతే వేగంగా కింద పడిపోయాడు. ఐతే ‘హృదయ కాలేయం’ తీసిన సాయి రాజేష్ మళ్లీ ‘కొబ్బరి మట్ట’ అనే సినిమా మొదలుపెట్టడంతో దీనిపై కొంత ఆసక్తి మొదలైంది జనాల్లో.

సినిమా మొదలైనప్పటి నుంచి వెరైటీ ప్రమోషన్లతో దాన్ని వార్తల్లో నిలబెడుతూ బాగానే క్రేజ్ తీసుకురాగలిగారు. కానీ ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. ఆ సినిమాకు బ్రేక్ పడింది. అసలు వార్తల్లో లేకుండా పోయింది. రెండేళ్ల కిందటే రావాల్సిన సినిమా ఇప్పటికీ అడ్రస్ లేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. సినిమా మాత్రం బయటికి రావట్లేదు.

కొన్ని నెలల కిందట కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టడానికి రాబోతున్న ‘కొబ్బరిమట్ట’ అంటూ ఒక పోస్టర్ వదిలారు. తర్వాత మళ్లీ అదే కథ. ఐతే ఇప్పుడు సాయిరాజేష్ ‘కొబ్బరి మట్ట’ గురించి కొత్త అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమా పూర్తయిందని.. విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పాడు. ఏడాదిన్నర పాటు కష్టపడి సినిమాను రెడీ చేశామని.. కష్టం అనేది చిన్న మాట అని.. ఈ సినిమాను నిర్మించడానికి రక్తం.. చెమట.. కన్నీళ్లు ఖర్చు చేశానని.. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తాను అనేది తన బుర్రలో ఇప్పుడు ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన అని చెప్పాడు సాయిరాజేష్. ‘

‘ప్రతి బ్యాచిలర్ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ ‘కొబ్బరిమట్ట’ అవబోతోంది. ఒక కొత్త రకమైన.. అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. we need ur love and support.. షేర్లు.. లైకులు చేస్తారు.. ఎందుకంటే బేసిగ్గా మీరు మంచోరు’’ అని ట్వీట్ రాజేష్ చేశాడు. మరి ‘కొబ్బరి మట్ట’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో.. ఏమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు