‘జంజీర్’ ఫెయిల్యూర్‌పై ఇన్నాళ్లకు..

‘జంజీర్’ ఫెయిల్యూర్‌పై ఇన్నాళ్లకు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్నాపకాల్లో అతను హిందీలో నటించిన ‘జంజీర్’ ఒకటి. టాలీవుడ్లో నిలదొక్కుకుంటున్న సమయంలోనే బాలీవుడ్‌కు వెళ్లి అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్‌లో నటించాడు చరణ్.

ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. చరణ్ నటనపై అక్కడ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదొక అవమానంగా మిగిలిపోయింది చరణ్‌కు. అతనెప్పుడూ ఈ సినిమా గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. బాలీవుడ్లో మళ్లీ సినిమా చేయడం గురించి కూడా స్పందించేవాడు కాదు. ఐతే ‘రంగస్థలం’తో భారీ విజయాన్నందుకున్న ఊపులో ఉన్న చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘జంజీర్’ ఫెయిల్యూర్‌పై ఓపెనయ్యాడు.

‘జంజీర్’ ఫెయిల్యూర్ తనను చాలా బాధ పెట్టిందని చరణ్ చెప్పాడు ‘‘మేం నిజాయితీగా చేసిన ప్రయత్నం ‘జంజీర్‌’. కానీ అది విజయవంతం కాలేదు. అది నా తొలి హిందీ సినిమా.. అనేక అంచనాల మధ్య విడుదలైంది. దీంతో నేను చాలా బాధపడ్డా.‌ అలాగని ఇంకెప్పుడూ బాలీవుడ్‌ సినిమాల్లో నటించనని కాదు. భవిష్యత్తులో మంచి కథలు వస్తే.. కచ్చితంగా నటిస్తా’’ అని చరణ్ చెప్పాడు.

‘జంజీర్’ టైంలో హీరోయిన్ ప్రియాంక చోప్రాతో చరణ్‌కు విభేదాలని ప్రచారం జరిగింది. ఐతే చరణ్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాడు. ‘‘ప్రియాంక అందమైన నటి. ఆమె అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తుంది. ఆమెతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి.. అలాంటి అనుభూతి మరోసారి పొందేందుకు ఇష్టపడతా’’ అని చరణ్ అన్నాడు. తనకు హాలీవుడ్లో నటించే ఆలోచనలేమీ లేవని.. అయినా కెరీర్లో ఏదీ ప్లాన్ చేసుకోనని అన్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు