స్పీచ్ ఇస్తూ హీరోయిన్‌కి ఫోన్ చేశాడు

స్పీచ్ ఇస్తూ హీరోయిన్‌కి ఫోన్ చేశాడు

ఒక హీరో సినిమాకు సంబంధించి ఆడియో వేడుకో.. ప్రి రిలీజ్ ఈవెంటో జరుగుతుంటుంది. కానీ అక్కడ హీరోయిన్ ఉండదు. అయినప్పటికీ హీరో హీరోయిన్ గురించి ప్రస్తావిస్తాడు. ఆమె సూపర్ అంటాడు. అనుకోని కారణాల వల్ల హీరోయిన్ రాలేకపోయింది అని చెబుతాడు. ఐతే మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రం అలా చేయలేదు. తన కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను మాట్లాడుతున్నపుడు హీరోయిన్ ప్రస్తావన రాగానే స్టేజ్ మీది నుంచే అనుపమ పరమేశ్వరన్‌కు ఫోన్ చేసేశాడు.

ఆమెకు.. అక్కడున్న ఆహూతులకు పెద్ద షాకిచ్చేశాడు. భీమవరంలోని విష్ణు కాలేజీలో ఈ చిత్రం చోటు చేసుకుంది. కాలేజీ స్టూడెంట్స్ మధ్య చాలా ఉత్సాహంగా సాగి ఈ ఈవెంట్లో తేజు అనుపమకు స్టేజ్ మీది నుంచి ఫోన్ చేయడమే హైలైట్.

తాను ఇప్పుడు ఫోన్ చేయకపోతే అనుపమ.. కాదు కాదు నాగవల్లి తనను చంపేస్తుంది అంటూ అతను అనుపమకు కాల్ కలిపాడు. అవతల అనుపమ ఫోన్ ఎత్తగానే స్పీకర్ ఆన్ చేస్తున్నాను మాట్లాడు అన్నాడు. ఆమె అందరికీ హాయ్ చెప్పి.. కొన్ని కారణాల వల్ల తాను రాలేకపోయానని.. కానీ టీవీ ముందు కూర్చుని ఈ ఈవెంట్ చూస్తున్నానని చెప్పింది. తేజును చూస్తే తనకు చాలా అసూయగా ఉందని.. అంతమంది అమ్మాయిల మధ్య కృష్ణుడి లాగా కనిపిస్తున్నాడని.. తాను కూడా అక్కడ ఉండాల్సిందని చెప్పింది.

చివరగా అందరికీ ఉమ్మా ఇచ్చేసి టాటా చెప్పింది అనుపమ. ఆ తర్వాత తేజు తన స్పీచ్ కొనసాగిస్తూ.. ‘తేజ్ ఐ లవ్యూ’ తన కెరీర్లో చాలా స్పెషల్ మూవీ అని.. తాను చేసిన తొలి పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం ఇదని.. ఇందులో కొంచెం ఫ్యామిలీ టచ్ ఉన్నప్పటికీ ప్రధానంగా లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుందని.. తనకు, అనుపమకు మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయని చెప్పాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English