సురేష్ బాబు నోట ‘వెంకీ మామ’ మాట

సురేష్ బాబు నోట ‘వెంకీ మామ’ మాట

టాలీవుడ్లో సుదీర్ఘ, ఘన చరిత్ర కలిగిన బేనర్లలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ ఒకటి. ఐతే ఆ సంస్థ ఒకప్పటిలా పెద్ద సినిమాలు తీయట్లేదు. చిన్న, మీడియం రేంజి సినిమాలకే పరిమితం అవుతోంది. ఆ సంస్థ నుంచి కొత్తగా వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ కూడా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమే.

ఒకప్పుడు భారీ సినిమాలు తీసి.. ఇప్పుడు చిన్న వాటికే పరిమితం అయిపోయారేంటి అని సురేష్ బాబును ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. అలాంటిదేమీ లేదన్నారు. అనుకోకుండా ఈ విషయంలో గ్యాప్ వచ్చిందని.. ఏదో ఒక రకం సినిమాలే చేయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. తన బేనర్ నుంచి తర్వాత రాబోయేది పెద్ద సినిమానే సురేష్ బాబు తెలిపారు. తన తమ్ముడు వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్య కాంబినేషన్లో ఓ పెద్ద సినిమా చేయబోతున్న సంగతిని ఆయన ధ్రువీకరించాడు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నామని కూడా సురేష్ వెల్లడించారు. ఈ చిత్రం పెద్ద బడ్జెట్లోనే తీయబోతున్నామన్నారు. ఇంకా కొన్ని పెద్ద సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు వెల్లడించారు. తాను అన్ని రకాల సినిమాలూ తీయాలని కోరుకుంటానన్నారు. కొందరేమో పెద్ద సినిమాలకే పరిమితమై అవే మంచివి అంటారని.. ఇంకొందరేమో చిన్న సినిమాలే నయం అంటారని.. కానీ ఏదో ఒక తరహా సినిమాలు మాత్రమే ఆడతాయని అనుకోలేమని చెప్పారు.

‘బాహుబలి’ సినిమా బాగా ఆడింది కాబట్టి ఇలాంటి సినిమాలు అందరూ తీయాలని గొప్పగా చెబుతున్నారని.. కానీ ఆ సినిమా ఆడకపోయి ఉంటే అలాంటి సినిమాల జోలికే వెళ్లొద్దని అంటారని చెప్పారు. ఒక నిర్మాతకు ఏది సంతోషాన్నిస్తుందో.. ఏది లాభం తెచ్చిపెడుతుందో ఆ సినిమా చేస్తాడని.. ఈ విషయంలో ఎవరిష్టం వాళ్లదని సురేష్ స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు