సుధీర్ బాబు.. ది డిస్ట్రిబ్యూటర్

సుధీర్ బాబు.. ది డిస్ట్రిబ్యూటర్

మహేష్ బాబు బావ సుధీర్ బాబు అందరికీ హీరోగానే పరిచయం. ఇప్పుడతను నిర్మాతగా మారి ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమా తీస్తున్న సంగతీ తెలిసిందే. ఐతే నిర్మాత కావడానికి.. నటుడిగా అరంగేట్రం చేయడానికి ముందే అతను డిస్ట్రిబ్యూటర్ అట. ఐదారు ప్రముఖ సినిమాల్ని అతను డిస్ట్రిబ్యూట్ చేశాడట. ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.

ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ బేనర్లలో ఒకటిగా ఉన్న ‘యువి క్రియేషన్స్’లో భాగస్వామి అయిన వంశీతో కలిసి సుధీర్ సినిమాలు పంపిణీ చేశాడట. అతడి తొలి సినిమా ‘ఆర్య’ అట. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తమకు దక్కడానికి ప్రభాసే కారణమని సుధీర్ వెల్లడించాడు. ప్రభాస్ చెప్పాడనే దిల్ రాజు ‘ఆర్య’కు సంబంధించి ఒక ఏరియా హక్కుల్ని సుధీర్-వంశీలకు ఇచ్చాడట.

‘ఆర్య’ మంచి ఫలితాన్నందుకోవడంతో ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘భద్ర’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని పంపిణీ చేసే అవకాశం వచ్చిందట. మొత్తంగా ఆరేడు సినిమాల్ని పంపిణి చేశానని.. కానీ డిస్ట్రిబ్యూటర్‌గా ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోలేదని సుధీర్ తెలిపాడు. ఐతే హీరోగా తన తొలి సినిమా ‘ఎస్ఎంఎస్’ మాత్రం తనకు నష్టాలు తెచ్చిపెట్టిందని సుధీర్ చెప్పాడు. ఆ సినిమాకు నిర్మాతగా తన పేరు పడకపోయినప్పటికీ డబ్బులు సమకూర్చింది మాత్రం తానేనని.. ఆ సినిమా తెచ్చిన నష్టం నుంచి కోలుకోవడానికి తనకు రెండేళ్లు పట్టిందని సుధీర్ తెలిపాడు.

ఇప్పుడు ఇండస్ట్రీపై తనకు మంచి అవగాహన వచ్చిందని.. దీంతో ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ పేరుతో బేనర్ పెట్టానని.. ప్రేక్షకుడి కోణంలో ఆలోచిస్తూ సినిమాలు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని సుధీర్ తెలిపాడు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English