కుర్రాడి జాతకం ఆ రోజు తేలిపోతుంది

కుర్రాడి జాతకం ఆ రోజు తేలిపోతుంది

జులై నెల చాలామంది హీరోలకు పరీక్షగా నిలవబోతోంది. వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న హీరోలు ఈ నెలలో రాబోయే సినిమాలపై భారీ ఆశలతో ఉన్నారు. ముందుగా గురువారం గోపీచంద్ నుంచి ‘పంతం’ రాబోతోంది. ఆ మరుసటి రోజే సాయిధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్యూ’తో పలకరిస్తాడు. ఈ ఇద్దరు హీరోల కెరీర్ ఎలా సాగుతోందో తెలిసింది. వీళ్లు హిట్టు కోసం ముఖం వాచిపోయి ఉన్నారు. మరోవైపు నారా రోహిత్ సైతం ‘ఆటగాళ్లు’ తనకు సక్సెస్ అందిస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలూ ఎంతో కొంత బ్యాకప్ ఉన్న వాళ్లే.

కానీ రాజ్ తరుణ్ సంగతి వేరు. అతను ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరోగా కెరీర్ ఆరంభంలో వరుస విజయాలందుకున్నాడు. దాంతో పాటే అవకాశాలు కూడా పెరిగాయి. కానీ అంతా బాగుందనుకున్న తరుణంలో వరుసగా పరాజయాలు పలకరించాయి. రెండేళ్ల వ్యవధిలో నాలుగైదు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాదిలో అయితే రాజ్ నుంచి వచ్చిన ‘రంగుల రాట్నం’.. ‘రాజుగాడు’ మరీ తీసికట్టుగా తయారయ్యాయి. రాజ్ మార్కెట్ ను పూర్తిగా పోగొట్టేశాయి. ఇలాంటి స్థితిలో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత రాజ్‌ను హీరోగా పెట్టి తీసిన ‘లవర్’ రాబోతోంది. ‘అలా ఎలా’ లాంటి మంచి హిట్టుతో దర్శకుడిగా పరిచయం అయిన అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రాజ్ సంగతెలా ఉన్నా.. మిగతా సెటప్ అంతా బాగా కుదిరింది. ఇటీవలే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఆడియో కూడా మంచి స్పందన తెచ్చుకుంది.

మరి ఈ సినిమా అయినా రాజ్ జాతకాన్ని మారుస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని జులై 20న రిలీజ్ చేయబోతున్నట్లు కన్ఫమ్ చేస్తూ ఈ రోజే పోస్టర్లు కూడా వదిలింది చిత్ర నిర్మాణ సంస్థ. మరి ఆ రోజు మధ్యాహ్నానికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు