చరణ్‌తోనే కాదు.. చిరంజీవితోనూ

చరణ్‌తోనే కాదు.. చిరంజీవితోనూ

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వరుసబెట్టి సినిమాలు తీశాడు అగ్ర నిర్మాత కె.ఎస్.రామారావు. అప్పట్లో చిరు-రామారావు కలిస్తే సూపర్ హిట్ గ్యారెంటీ అన్న అభిప్రాయం ఉండేది. ఐతే వీళ్ల కాంబినేషన్లో చివరగా వచ్చిన ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ ఫ్లాపైంది. తర్వాత మళ్లీ వీరు కలిసి సినిమా చేయలేదు. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్‌తో కాకపోయినా మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో ‘తేజ్ ఐ లవ్యూ’ చిత్రాన్ని నిర్మించడం ద్వారా మళ్లీ మెగా కాంపౌండ్లోకి వచ్చాడు రామారావు.

ఈ చిత్ర ఆడియో వేడుక సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రామారావు బేనర్లో తన కొడుకు రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందని హామీ ఇచ్చాడు. ఐతే చరణ్‌తోనే కాక చిరంజీవితో కూడా తాను సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రామారావు తెలిపాడు.

తన బేనర్‌కు ఉన్న గుర్తింపు వల్లే చరణ్ స్వచ్ఛందంగా సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని.. ఆ సినిమా కచ్చితంగా ఉంటుందని రామారావు చెప్పాడు. ఐతే తనకు చిరంజీవితో మళ్లీ సినిమా చేయాలని ఉందని.. కచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తానని రామారావు తెలిపాడు. ‘తేజ్ ఐ లవ్యూ’ పూర్తిగా కరుణాకరన్ స్టయిల్లో ఉంటుందని.. ఈ సినిమాతో తన బేనర్‌కు మళ్లీ మంచి విజయం దక్కుతుందని ఆయనన్నారు.

తాను ఇప్పటిదాకా 45 సినిమాలు నిర్మించానని.. అందులో నాలుగైదు మాత్రమే ఫ్లాప్ అయ్యానని.. తనకంటూ ఒక అభిరుచి ఉందని రామారావు చెప్పారు. ఊరికే డబ్బులు పెట్టే క్యాషియర్ లాగా తాను ఎప్పుడూ లేనని.. నిఖార్సయిన నిర్మాతలాగే ఉన్నానని.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి రావడం వల్ల కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని.. ఒక సీన్ నచ్చలేదంటే దర్శకుడికి చెప్పి మార్పించే సామర్థ్యం ఉందని రామారావు అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు