తమిళ హీరోలపై సెటైర్లే సెటైర్లు

తమిళ హీరోలపై సెటైర్లే సెటైర్లు

హాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలపై స్పూఫ్‌లు చేస్తూ తెరకెక్కే సినిమాలు కూడా భలేగా ఆడేస్తుంటాయి. ఇండియన్ సినిమాలో ఇలాంటి ప్రయత్నాలు తక్కువే. ఐతే కొన్నేళ్ల కిందట తమిళంలో ‘తమిళ్ పడం’ పేరుతో ఇలాంటి సెటైరిక్ మూవీ ఒకటి తీశారు. హీరో సెంట్రిక్‌గా సాగే తమిళ సినిమాలపై ఓ రేంజిలో సెటైర్లు వేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివ అనే చిన్న స్థాయి హీరో నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం రేపింది. పెద్ద హిట్టయింది. దీన్నే తెలుగులో అల్లరి నరేష్ హీరోగా ‘సుడిగాడు’ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్టయింది. ఇప్పుడు తమిళంలో ‘తమిళ్ పడం’ సీక్వెల్ వస్తోంది. ‘తమిళ్ పడం 2.0’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలి భాగానికి దీటుగా దీన్ని తీర్చిదిద్దినట్లున్నారు.

కొన్ని రోజులుగా ‘తమిళ్ పడం-2’ ప్రోమోలు కోలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. జయలలిత మరణాననంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతూ ఆమె సమాధి వద్ద పన్నీర్ సెల్వం ధ్యానం చేసినప్పటి ఫొటో గుర్తుండే ఉంటుంది. ‘తమిళ్ పడం-2’ ఫస్ట్ లుక్‌లో హీరో సైతం ఇలాగే వైట్ అండ్ వైట్‌లో ధ్యానం చేస్తూ కనిపించాడు. ఇక ఆ తర్వాత దీని టీజర్ లాంచ్ చేశారు. అందులో కోలీవుడ్లో సూపర్ హిట్టయిన సినిమాల్లోని హీరోల పాత్రల్ని అనుకరించడం కనిపించింది. చాలా సినిమాల ఛాయలు కనిపించాయి అందులో. అది పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోల ఇంట్రడక్షన్ సాంగ్స్‌ని పేరడీ చేస్తూ ఒక పాట లాంచ్ చేశారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ సహా చాలా మంది హీరోలపై పంచ్‌లు పడ్డాయి. ‘కబాలి’లోని నెరుప్పుడా అనే పాటను ‘పరుప్పుడా’ అనే పదంతో మొదలుపెట్టడం విశేషం. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు భయపడకుండా ఇలా పేరడీలు చేయడం, సెటైర్లు వేయడం అంటే మామూలు విషయం కాదు. ఎలాగైతేనేం ఈ సినిమాకు మంచి హైప్ అయితే వస్తోంది. త్వరలోనే ‘తమిళ్ పడం 2.0’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు