సొంత కథతోనే సినిమా తీసేశాడే..

సొంత కథతోనే సినిమా తీసేశాడే..

‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విడుదలకు ముందు నుంచే పాజిటివ్ బజ్ ఉంది. సినిమా పక్కా హిట్ అనే ఫీలింగ్ మధ్య ఈ చిత్రం రిలీజైంది. ఐతే ముందే అంచనాలు పెరిగిపోవడం వల్ల చూసిన జనాలకు సినిమా అనుకున్నంత లేదనిపిస్తోంది.  మిక్స్‌డ్ టాక్ మధ్య సినిమా ఓ మోస్తరు ఓపెనింగ్స్‌తో నడుస్తోంది. ఐతే సినిమాను తీసి పడేయడానికైతే లేదు. తరుణ్ తొలి సినిమా చూస్తే నిజ జీవిత సంఘటనలు.. వ్యక్తుల స్ఫూర్తితోనే సినిమా తీశాడేమో అనిపిస్తుంది. ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ చూస్తుంటే అతడి కథనే సినిమాగా తీసేశాడని స్పష్టమవుతుంది. ఇది స్వయంగా తరుణ్ భాస్కర్ కథే కావడం విశేషం.

కాలేజీ రోజుల నుంచే తన స్నేహితులతో కలిసి షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టి.. మధ్యలో లవ్ ఫెయిల్యూర్ వల్ల దారి తప్పి.. ఆపై అనుకోని పరిస్థితుల్లో తిరిగి ఆ స్నేహితులందరితో కలిసి మళ్లీ ఓ షార్ట్ ఫిలిం తీసి.. చివరగా సినిమా కలను నెరవేర్చుకునే కుర్రాడి కథ ఇది. ఆ కుర్రాడు మరెవ్వరో కాదు.. తరుణ్ భాస్కర్. ఆ సంగతి సినిమా చివర్లో వెల్లడుతుంది. అంతా అయ్యాక ‘పెళ్ళిచూపులు’ సినిమా తీస్తున్న అనుభవాన్ని చూపిస్తాడు తరుణ్. అక్కడ విజయ్ దేవరకొండ దర్శనమిస్తాడు. అతను ట్రక్కు నడుపుతుంటే.. పక్కన ప్రియదర్శి పాత్రలో ‘ఈ నగరానికి ఏమైంది’ కమెడియన్ అభినవ్ గోమఠం కనిపిస్తాడు. ‘పెళ్ళిచూపులు’ తర్వాత మంచి ఆఫర్లు వచ్చినా వెంటనే సినిమా చేయని తరుణ్.. కొంచెం గ్యాప్ తీసుకుని తన కథే రాసుకుని ఇలా సినిమా తీసేయడం విశేషమే. మరి దీని తర్వాత అతను ఎలాంటి ప్రయత్నం చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు