పాకిస్థాన్‌లో సల్మాన్ సినిమా సంచలనం

పాకిస్థాన్‌లో సల్మాన్ సినిమా సంచలనం

మన ఖాన్ త్రయం సినిమాలకు పాకిస్థాన్‌లోనూ మంచి డిమాండే ఉంటుంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమాలంటే అక్కడి జనాలు పడి చస్తారు. గతంలో సల్మాన్ సినిమాలు చాలానే పాకిస్థాన్‌లో భారీ వసూళ్లు సాధించాయి. తాజాగా ‘రేస్-3’ సైతం పాకిస్థాన్‌లో అదరగొట్టేస్తోంది. ఇండియాలో రిలీజైన ఎనిమిది రోజుల తర్వాత ఆలస్యంగా పాకిస్థాన్‌లో విడుదలైన సల్మాన్ సినిమా అక్కడ తొలి రోజే 2.25 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం. దీనికి పోటీగా విడుదలైన పాకిస్థాన్ సినిమాల కంటే ‘రేస్-3’కే ఎక్కువ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఇదే వీకెండ్లో ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’తో పాటుగా పాకిస్థాన్ సినిమా ‘7 దిన్ మొహబ్బత్ ఇన్’ కూడా రిలీజైంది. ఈ రెంటి కంటే కూడా ‘రేస్-3’కే తొలి రోజు అధిక వసూళ్లు వచ్చాయి.

ఈ ఏడాది పాకిస్థాన్‌లో విడుదలైన ఇండియన్ హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్ల రికార్డు కూడా ‘రేస్-3’దే. మొత్తంగా ఆ దేశంలో రిలీజైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి. ముందు వారం విడుదలైన ఒక పాకిస్థాన్ సినిమా వీకెండ్లో రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించడాన్ని పెద్ద విశేషంగా చెప్పుకుంటున్నారు. సల్మాన్ సినిమా జోరు చూస్తుంటే దానికి దీటుగా వసూళ్లు సాధించేలా ఉంది. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రేస్-3’ని మన విశ్లేషకులు చెత్త సినిమా అని తేల్చేశారు. కానీ రంజాన్ సీజన్లో వచ్చే ప్రతి సల్మాన్ సినిమా లాగే దీనికీ భారీగా వసూళ్లు దక్కాయి. తొలి వారాంతంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయింది. అంతిమంగా ఈ చిత్రాన్ని ఫ్లాప్‌గానే తేల్చారు బాక్సాఫీస్ పండిట్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు