ఆరు కోట్ల లాభమిచ్చే కథ ఇదేనా?

ఆరు కోట్ల లాభమిచ్చే కథ ఇదేనా?

రెండు కోట్లు పెట్టుబడి పెట్టండి.. ఎనిమిది కోట్లు ఆదాయం తీసుకోండి అంటూ ఒక కథ పట్టుకెళ్లి టాలీవుడ్లో తనకు పరిచయం ఉన్న ప్రముఖులందరినీ కలిసినట్లుగా చెప్పుకున్నాడు ‘శంభోశంకర’తో హీరోగా పరిచయం అయిన షకలక శంకర్. తన దగ్గర అంత మంచి కథ ఉండటంతో ధీమాగా అందరినీ కలిశానని.. కానీ త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు శిరీష్, రవితేజ  వీళ్లంతా చూద్దాం చేద్దాం అన్నారే తప్ప వెంటనే సినిమా మొదలుపెట్టడానికి మాత్రం ముందుకు రాలేదంటూ అతను సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శంకర్ ఇంత ధీమాగా చెప్పాడంటే ‘శంభో శంకర’ కథలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని.. సినిమాలో విషయం లేకుండా ఉండదని చాలామంది భావించారు. తీరా ‘శంభో శంకర’ చూసిన వాళ్లంతా.. ఇదా ఆరు కోట్ల లాభం తెచ్చిపెట్టే కథ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఒక పల్లెటూరు.. దాన్ని గుప్పెట్లో ఉంచుకున్న ఒక ప్రెసిడెంటు.. అతడికి ఎదురెళ్లే ఒక కుర్రాడు.. ఇది సింపుల్‌గా ‘శంభో శంకర’ కథ. నాలుగైదు దశాబ్దాల కిందట్నుంచే చూస్తున్నాం ఇలాంటి కథలు. పోనీ కొన్నేళ్లు వెనక్కి వెళ్లి దీన్నేమైనా ‘రంగస్థలం’ తరహాలో కళాత్మకంగా తీశారా అంటే అదీ లేదు. ఇప్పటి నేపథ్యంలోనే చాలా సాధారణంగా సినిమా సాగిపోతుంది. సినిమా మొదలైనప్పట్నుంచి చివరి దాకా ఎక్కడా రవ్వంత కొత్తదనం కనిపించదు. సునీల్, సప్తగిరి లాంటి కమెడియన్ టర్న్డ్ హీరోల్లాగే డ్యాన్సులు, ఫైట్లలో తన టాలెంట్ చూపించుకోవడానికే శంకర్ కూడా ప్రయత్నించాడు. కనీసం వాళ్లు కొంచెమైనా విషయమున్న కథల్లో నటించారు. కొంచెం సాధారణంగా నటించడానికి కూడా ప్రయత్నించారు. కానీ శంకర్ మాత్రం పూర్తిగా ఒక మాస్ హీరోలాగే విన్యాసాలు చేశాడు. అసలే సినిమాకు హైప్ లేదు. పైగా విపరీతమైన పోటీ మధ్య రిలీజైంది. టాక్ గురించి మాట్లాడే వాళ్లు కూడా కనిపించడం లేదు. ఈ స్థితిలో ‘శంభో శంకర’ ఆరు కోట్ల లాభం తేవడం కాదు కదా.. కనీసం పెట్టుబడి వెనక్కి తీసుకురావడం కూడా కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు