బాహుబలి నిర్మాతలతో దేవా కట్టా

బాహుబలి నిర్మాతలతో దేవా కట్టా

‘బాహుబలి’ సినిమా కోసం ఏ నిర్మాతలూ చేయని సాహసం చేశారు శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేని. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ ఈ సినిమా కోసం పెట్టారు. రెండు భాగాలకు కలిపి ఏకంగా ఐదేళ్లకు పైగా సమయం వెచ్చించారు. బాహుబలి తర్వాత వీరి నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడితో శర్వానంద్ హీరోగా ఒక సినిమా చేయడానికి వాళ్లు సన్నాహాలు చేశారు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు ‘స్వర్ణ ఖడ్గం’ పేరుతో ‘బాహుబలి’ స్టయిల్లో ఒక సీరియల్ తీయడం మొదలుపెట్టారు. అది శుక్రవారం నుంచే ఈటీవీలో ప్రసారమవుతోంది.

దీని తర్వాత కూడా ఆర్కా మీడియా నుంచి సినిమా ఏమీ రావట్లేదు. ఐతే ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లుగా అంతర్జాతీయ స్థాయి వెబ్ సిరీస్‌ను మొదలుపెట్టబోతున్నట్లు శోభు, ప్రసాద్ వెల్లడించారు.  ‘బాహుబలి’కి ప్రీక్వెల్‌ కథతో ఈ వెబ్ సిరీస్ ఉంటుందట. శివగామి కథ ప్రధానంగా ఇది సాగుతుందట. దేశంలో మరెవ్వరూ చేయనంత భారీ స్థాయిలో ఈ వెబ్ సిరీస్‌ను తీర్చిదిద్దుతామని శోభు, ప్రసాద్ అంటున్నారు. మొత్తం వెబ్ సిరీస్‌కు కలిపి ‌ముగ్గురు దర్శకులు ఉంటారని.. వారిలో ‘ప్రస్థానం’ దర్శకుడు దేవకట్టా ఒకరని చెప్పారు. అతడితో పాటు హిందీ నుంచి ఒకరు, తెలుగు నుంచి ఇంకో దర్శకుడు కూడా ఈ వెబ్ సిరీస్‌కు పని చేస్తారట. అందరూ కొత్తవాళ్లే నటించే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ రెండు మూడు నెలల్లో రామోజీ ఫిలింసిటీలోనే మొదలుపెట్టబోతున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు