సప్తగిరి సక్సెస్.. శంకర్ ఫెయిల్

సప్తగిరి సక్సెస్.. శంకర్ ఫెయిల్

టాలీవుడ్లో మరో కమెడియన్ హీరో అయ్యాడు. చిన్న చిన్న కామెడీ వేషాలతో మొదలుపెట్టి ఆ తర్వాత బిజీ అయిన షకలక శంకర్ కథానాయకుడిగా మారి ‘శంభో శంకర’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రి రిలీజ్ బజ్ రాలేదు.

ఇంకో ఆరు సినిమాలతో పాటుగా రిలీజవుతుండటం.. పైగా సినిమాలకు అన్ సీజన్ అనదగ్గ జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం ప్రతికూలమైంది. దీనికి తోడు టీజర్.. ట్రైలర్లు కూడా హైప్ తేవడంలో విఫలమయ్యాయి. ఈ విషయంలో శంకర్ కంటే ముందు హీరోగా మారిన కమెడియన్ సప్తగిరికి కలిసొచ్చినట్లుగా పాపం శంకర్ కు పరిస్థితులు అనుకూలించలేదు.

హీరోగా సప్తగిరి తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’కు హైప్ బాగానే వచ్చింది. ఆ చిత్రం సప్తగిరి స్థాయికి పెద్ద స్థాయిలోనే రిలీజైంది. సప్తగిరి.. శంకర్ ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులే. పవన్ పేరును వాడుకోవడానికి ప్రయత్నించిన వాళ్లే. తమ సినిమాలో పవన్ రెఫరెన్సుల కోసం ట్రై చేసిన వాళ్లే. ఐతే తన సినిమాకు పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ సంపాదించడంలో సప్తగిరి సక్సెస్ అయ్యాడు కానీ.. శంకర్ ఫెయిలయ్యాడు.

సప్తగిరి ఏదీ ప్లాన్ చేసి చేయకపోయినప్పటికీ అతడి సినిమాకు అనుకోకుండా పవన్ సపోర్ట్ లభించింది. అతను తన సినిమాకు పెట్టుకున్న ‘కాటమరాయుడు’ టైటిల్‌ పవన్ కు కావాల్సి రావడంతో అందుకు బదులుగా సప్తగిరి సినిమా ఆడియో వేడుకకు వచ్చి అతడిని ఆశీర్వదించాడు పవన్.

ఆ వేడుక సినిమాకు హైప్ తెచ్చింది. పవన్ అభిమానులు.. సప్తగిరిని ఓన్ చేసుకున్నారు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు అంత మంచి టాక్ రాకపోయినా.. లాభాలు వచ్చాయి. కానీ శంకర్ తన సినిమాలో పవన్ రెఫరెన్సుల కోసం గట్టిగా ట్రై చేసినా.. ఈ సినిమా ప్రమోషన్లలోనూ పవన్ గురించి చాలా మాట్లాడినా.. దీనికి అనుకున్నంత హైప్ రాలేదు. పవన్ అభిమానులు ఓన్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు