షకలక శంకర్ సినిమా ఆగిపోయింది

షకలక శంకర్ సినిమా ఆగిపోయింది

ఈ శుక్రవారం ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షకలక శంకర్. ఈ సినిమా పట్టాలెక్కించడానికి తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకునే క్రమంలో ఈ మధ్యే సంచలన వ్యాఖ్యలు చేశాడు శంకర్. త్రివిక్రమ్ శ్రీనివాస్.. దిల్ రాజు.. అల్లు శిరీష్.. రవితేజ తనతో సినిమా చేయమంటే ఎలా స్పందించిందీ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడిచింది. ఐతే శంకర్ తన వ్యాఖ్యల్లో దురుద్దేశమేమీ లేదంటున్నాడు. ‘శంభో శంకర’ రిలీజ్ ముంగిట మీడియాతో మాట్లాడుతూ.. తాను ఉన్న మాటే మాట్లాడానని అన్నాడు. డ్యాన్సులు, ఫైట్లు చేసి టాలెంట్ చూపించుకోవాలని తాను హీరో కాలేదని.. తనకు సంతృప్తినిచ్చే పాత్రలు రాకపోవడం, చేతినిండా పని లేకపోవడం వల్లే కథానాయకుడిగా మారానని అతను చెప్పాడు.

కమెడియన్‌గా అందుకున్న పారితోషకంతో పోలిస్తే హీరోగా ‘శంభోశంకర’ చిత్రానికి తక్కువ మొత్తమే అందుకున్నట్లు అతను వెల్లడించాడు. ఇక తాను హీరోగా మొదలైన మరో సినిమా ‘డ్రైవర్ రాముడు’ దాదాపుగా ఆగిపోయినట్లే అని అతను సంకేతాలిచ్చాడు. ఆ సినిమా ప్రస్తావన తీసుకొస్తే.. ఒక పాట, ఒక ఫైట్ తీశారని.. ఆ తర్వాత ఆ సినిమా సంగతేమైందో తనకు తెలియదని శంకర్ చెప్పాడు. ‘శంభో శంకర’ కంటే ముందే ‘డ్రైవర్ రాముడు’ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. దాని విషయంలో పూర్తిగా నెగెటివ్ కామెంట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాను ఆపేసినట్లుగా తెలుస్తోంది. శంకరే తనకు ఆ సినిమా గురించి తెలియదన్నాడంటే అది పూర్తయ్యే అవకాశాలు లేనట్లే. దాని సంగతలా వదిలేస్తే ‘శంభో శంకర’ సంగతేమవుతుందో చూడాలి. ఈ సినిమా కథ గురించి శంకర్ చాలా గొప్పలు పోయాడు కానీ.. టీజర్.. ట్రైలర్ చూస్తే మాత్రం ఇందులో కూడా ఏమంత విశేషం కనిపించలేదు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English