టికెట్లు తెగట్లేదు బాబోయ్..

టికెట్లు తెగట్లేదు బాబోయ్..

తెలుగు సినిమాలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు మొదలవడంతో ఈ నెలంతా సినిమాలు అంతంతమాత్రంగానే ఆడుతున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలకు నిరాదరణ కనిపిస్తోంది. ఈ నెలలో వచ్చిన ఏ తెలుగు సినిమా కూడా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. తొలి వారం విడుదలైన ‘ఆఫీసర్’.. ‘రాజు గాడు’ల పరిస్థితి ఏమైందో తెలిసిందే.

వీటితో పాటుగా వచ్చిన విశాల్ డబ్బింగ్ మూవీ ‘అభిమన్యుడు’ మాత్రమే చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. తర్వాతి వారం వచ్చిన రజనీకాంత్ సినిమా ‘కాలా’ డిజాస్టర్ అయింది. ఆ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కరవయ్యాయి. తర్వాతి వీకెండ్లో విడుదలైన ‘సమ్మోహనం’ చాలా మంచి టాక్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. టాక్‌కు తగ్గ వసూళ్లు రాలేదు. అతి కష్టం మీద పెట్టుబడి మాత్రం వెనక్కి వచ్చింది. లాభాలు ఆశించిన బయ్యర్లకు నిరాశ తప్పలేదు. అమెరికాలో మాత్రం ఈ చిత్రం లాభాలు అందించింది. దీంతో పాటుగా వచ్చిన ‘నా నువ్వే’ దారుణ ఫలితాన్నందుకుంది.

ఇక గత వారం విడుదలైన శ్రీనివాసరెడ్డి సినిమా ‘జంబ లకిడి పంబ’కూ చేదు అనుభవమే ఎదురైంది. హీరోగా శ్రీనివాసరెడ్డి విన్నింగ్ స్ట్రీక్‌కు ఈ సినిమాతో బ్రేక్ పడింది. ఈ చిత్రానికీ కనీస ఓపెనింగ్స్ రాలేదు. దీంతో పాటుగా వచ్చిన డబ్బింగ్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ పరిస్థితి కొంచెం పర్వాలేదు. గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ సినిమా కూడా జనాల్ని అంతగా థియేటర్లకు రప్పించట్లేదు. టికెట్లు తెగట్లేదు. థియేటర్లన్నీ చాలా తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.

ఈ శుక్రవారం ఒకేసారి ఏడు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ‘ఈ నగరానికి ఏమైంది’ మినహాయిస్తే ఏదీ జనాల్ని ఆకర్షించేలా కనిపించట్లేదు. మరి ఆ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.. ఏమేరకు థియేటర్లను నింపుతుందో.. మిగతా సినిమాల సంగతేంటో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English