అమీర్ లేడు.. రికార్డు కొడతాడా?

అమీర్ లేడు.. రికార్డు కొడతాడా?

బాలీవుడ్ కొన్నేళ్లుగా ఒడుదొడుకులతో సాగుతోంది. దక్షిణాది సినిమా ‘బాహుబలి’ వసూళ్ల ప్రభంజనంతో బాలీవుడ్ గాలి తీసేసింది. అదే సమయంలో ‘బాహుబలి’ ది కంక్లూజన్ తర్వాత బాలీవుడ్ భారీ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతకుముందు ఉన్న వసూళ్ల రికార్డుల్ని కూడా అందుకోలేకపోయాయి.

సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లాంటి బడా స్టార్ల సినిమాలు అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. ఒక్క ‘టైగర్ జిందా హై’ మాత్రమే ఓ మోస్తరుగా నడిచింది. మిగతావన్నీ తుస్సుమనిపించాయి. కొత్త ఏడాదిలో స్టార్ల సినిమాలేవీ కూడా ఆడలేదు. ‘రేస్-3’ సైతం ఆరంభ శూరత్వంతో సరిపెట్టుకుంది. దీంతో బాలీవుడ్ దృష్టంతా ఇప్పుడు ‘సంజు’ మీదే నిలిచింది. ఈ చిత్రం ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాసర్ అవుతుందన్న అంచనాలున్నాయి.

రాజ్ కుమార్ హిరానికి బాలీవుడ్లో భారీ రికార్డులే ఉన్నాయి. దశాబ్దం కిందట ‘3 ఇడియట్స్’తో వసూళ్ల ప్రభంజనం సృష్టించాడు హిరాని. అమీర్ ఖాన్ సత్తా కూడా తోడవడంతో అప్పటి వసూళ్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. మళ్లీ ఈ జోడీ ‘పీకే’తో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఐతే ఈసారి హిరాని రణబీర్ కపూర్ లాంటి మీడియం రేంజి హీరోతో కలిసి వస్తున్నాడు. రణబీర్‌కు కూడా ఒకప్పుడు మంచి మార్కెట్టే ఉండేది. కానీ వరుస ఫ్లాపులతో అది దెబ్బ తింది.

ఇప్పుడు ‘సంజు’తో అతడేమాత్రం సత్తా చాటుతాడో చూడాలి. ఈ సినిమా విషయంలో హీరో కంటే దర్శకుడే కీలకం. ఆయన్ని నమ్మే జనాలు సినిమాకు వస్తారు. ఈ చిత్రంపై అంచనాల్ని పెంచడంలో మాత్రం హిరాని విజయవంతమయ్యాడు. మంచి హైప్ మధ్య భారీగా ఈ చిత్రం విడుదలవుతోంది. ‘సంజు’ బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.240 కోట్లు వసూలు చేయాలట. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అదేమంత పెద్ద విషయం కాదంటున్నారు. దాని మీద ఇంకో 50 శాతం అధిక వసూళ్లు కూడా వస్తాయంటున్నారు. మరి అమీర్ తోడు లేకుండా హిరాని బాక్సాఫీస్ దగ్గర ఏమేరకు సత్తా చాటుతాడో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు