జాయింట్ ఉద్యమాలు జరిగే పనేనా ?

మిత్రపక్షాల మధ్య ఇప్పటినుంచైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ ఉద్యమాలు జరుగుతాయా ? ఇపుడిదే అంశంపై రెండుపార్టీల్లోను చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రెండు పార్టీలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ+జనసేన నేతల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు నేతలు కూడా పాల్గొన్నారు.

వీళ్ళ సమావేశం తర్వాత కూడా రెండుపార్టీల్లోను జాయింట్ ఆందోళనలపై ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సమావేశాలు చాలానే జరిగాయి. అయితే సమావేశాలు ఎన్ని జరిగినా ఆచరణలోకైతే పెద్దగా రాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో రెండు పార్టీలు దేనికదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు పార్టీల అగ్రనేతల మధ్య సరైన సమన్వయం లేదన్నది వాస్తవం. బహుశా వీర్రాజు, పవన్ కల్యాణ్ మధ్య ఇగో ప్రాబ్లమ్ ఏమన్నా అడ్డొస్తున్నదేమో అర్ధం కావటంలేదు. ఇద్దరు అగ్రనేతలు కలిసి జాయింట్ గా నిర్వహించిన కార్యక్రమం ఒక్కటి కూడా లేకపోవటంతోనే అందరిలోను ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి, ఆందోళనలు జరిగాయి. అలాగే పవన్ ఆధ్వర్యంలో కూడా సమావేశాలు, నిరసనలు జరిగాయి. కానీ జాయింటుగా మాత్రం జరగలేదు.

సమావేశాలు పెట్టుకోవడం, ఆందోళనలు చేయాలని నిర్ణయించడం రెండు పార్టీల అగ్రనేతలకు మామూలైపోయింది. ఆచరణలో కనిపించని నిర్ణయాలకు ఎన్ని సమావేశాలు పెట్టుకుంటే మాత్రమేమిటనే ప్రశ్న రెండు పార్టీల నేతల్లోను వినిపిస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే విజయవాడలో మిత్రపక్షాల అగ్రనేతల మధ్య తాజాగా సమావేశం జరగడం రెండు పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇప్పటినుంచైనా నేతలు కలిసి పోరాటాలు చేస్తారా లేదా అన్నది చూడాల్సిందే.