బయోపిక్ లో విలన్ పాత్ర ఆయనదేనా?

బయోపిక్ లో విలన్ పాత్ర ఆయనదేనా?

ఎన్టీఆర్ బయోపిక్‌‌ను పట్టాలెక్కించడానికి చకచకా సన్నాహాలు చేసేస్తోంది నందమూరి బాలకృష్ణ-క్రిష్ బృందం. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర ఏంటన్నది ఇంకా వెల్లడి కాలేదు.

ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మరో ప్రముఖ నటుడికి చోటు దక్కినట్లు తెలిసింది. బాలీవుడ్ సినిమాలతో మంచి పేరు సంపాదించి.. తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి పాత్రలు చేసిన సచిన్ ఖేద్కర్ ‘యన్.టి.ఆర్’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఆయనకు ఏ పాత్ర ఇస్తున్నది చిత్ర బృందం చెప్పలేదు కానీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం నాదెండ్ల భాస్కర రావు పాత్ర చేయనున్నాడట.

నాదెండ్ల పాత్ర చేయడానికి తగ్గ పోలికలు సచిన్‌లో ఉన్నాయి. గొప్ప నటుడు కూడా కావడంతో ఆయన ఈ పాత్రను పండించగలడని భావిస్తున్నారు. క్రిష్ బయోపిక్ లోకి రాకముందు నాదెండ్ల పాత్ర కోసం స్థానిక నటుల్నే పరిశీలించారట. ఐతే బాలీవుడ్ నటులపై మంచి అవగాహన ఉన్న క్రిష్.. నాదెండ్ల పాత్రకు సచిన్ అయితే బాగుంటారని చెప్పడంతో బాలయ్య ఓకే చేసినట్లు సమాచారం.

ఎన్టీఆర్ బయోపిక్‌లో ప్రధాన విలన్‌గా నాదెండ్లనే చూపించే అవకాశముంది. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఆయన ఇక్కడ లేనపుడు అక్రమంగా సీఎం కుర్చీ ఎక్కిన ఘనుడు నాదెండ్ల. ఐతే ఆయన ముచ్చట కొన్ని రోజులకే తీరిపోయింది. ఎన్టీఆర్ మళ్లీ ఆయన్ని గద్దె దించి సీఎం కుర్చీ ఎక్కారు. ఎన్టీఆర్ సినిమా తీస్తున్నది బాలయ్య కాబట్టి చంద్రబాబు జోలికి వెళ్లకుండా సినిమాలో నాదెండ్లనే మెయిన్ విలన్‌గా చూపించే అవకాశాలున్నాయి.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు