ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ మహా నటుడు

ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ మహా నటుడు

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లలో సినిమాలు తగ్గించేయడం వల్ల.. తన స్థాయికి తగ్గ సినిమాలు చేయకపోవడం వల్ల ఆయన వెనుకబడి పోయి ఉండొచ్చు కానీ.. ఒకప్పుడు మోహన్ బాబు ఎంత అద్భుతమైన పాత్రలు చేశాడో.. ఎంతగా ప్రేక్షకుల్ని అలరించాడో నిన్నటి తరాల వాళ్లకే తెలుసు. హీరో.. విలన్.. కమెడియన్.. క్యారెక్టర్ రోల్స్‌తో తన విలక్షణతను చాటుకున్న నటుడాయన.

ఇటీవలే సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో ఎస్వీఆర్ పాత్రలో తళుక్కుమన్న మోహన్ బాబు.. త్వరలోనే మరో బయోపిక్‌లో నటించనున్నట్లు సమాచారం. ఆ చిత్రం.. యన్.టి.ఆర్. ఇందులో ఓ కీలక పాత్రకు మోహన్ బాబును ఎంపి చేసుకుందట క్రిష్-బాలయ్య బృందం. ఆ పాత్ర ఏదన్నది మాత్రం వెల్లడి కాలేదు.

ఎన్టీఆర్ కుటుంబంతో మోహన్ బాబుకు గొప్ప అనుబంధమే ఉంది. మోహన్ బాబు కెరీర్ ఎదుగుదలలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పుకున్నాడు మోహన్ బాబు. రాజకీయ రంగంలోనూ కొంత కాలం ఎన్టీఆర్‌తో కలిసి సాగాడాయన. ఎన్టీఆర్ మరణానంతరం బాలయ్యతో మోహన్ బాబు అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

మంచు కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే బాలయ్య ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ సినిమా కూడా చేశాడు. ఆ సినిమా ఆడకపోయినా ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడానికి బాలయ్య కారణమయ్యాడు. ఇప్పుడు బాలయ్య రుణం తీర్చుకునే అవకాశం మోహన్ బాబుకు వచ్చింది. అందుకే బాలయ్య అడగ్గానే మరో మాట లేకుండా ఎన్టీఆర్‌ బయోపిక్‌కు ఓకే చెప్పాడట మోహన్ బాబు. మరి ఇందులో ఆయన ఏ పాత్ర చేస్తాడో.. దాన్నెలా రక్తి కట్టిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు