నిర్మాత కావాలన్నాడు.. దర్శకుడు వద్దన్నాడు

నిర్మాత కావాలన్నాడు.. దర్శకుడు వద్దన్నాడు

తెలుగులో తొలి సినిమానే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో చేయడం ఏ కథానాయికకైనా వరమే. కియారా అద్వానీ అలాంటి బంపరాఫరే దక్కించుకుంది. ‘భరత్ అనే నేను’ లాంటి భారీ సినిమాలో అవకాశం అందుకుంది. ఆ సినిమా మంచి ఫలితాన్నందుకుని కియారాకు చక్కటి పేరు తెచ్చిపెట్టింది.

ఇదే సమయంలో ‘లస్ట్ స్టోరీస్’ లాంటి ఎరోటిక్ వెబ్ సిరీస్‌లో నటించి తనలోని మరో కోణాన్ని చూపించింది కియారా. ఈ వెబ్ సిరీస్‌లో కియారా నటన.. హావభావాలు ప్రకంపనలు రేపుతున్నాయి. యూత్‌లో ఈ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చింది. ఇలాంటి టైంలో బాలీవుడ్లో ఒక భారీ సినిమా పడితే కియారా కెరీర్ మరో స్థాయికి చేరే అవకాశముంది. కానీ ఆ ఛాన్స్ అందినట్లే అంది మిస్సయిపోయినట్లు సమాచారం.

కరణ్ జోహార్ నిర్మాణంలో రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ‘సింబా’ సినిమాకు ముందు కియారానే కథానాయికగా అనుకున్నారట. కరణ్.. ఆమెను కథానాయికగా ఫైనలైజ్ చేశాడట. కానీ రోహిత్ శెట్టికి ఆమె నచ్చలేదట. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు కియారా సూటవ్వదని చెప్పి ఆమెను రిజెక్ట్ చేశాడట రోహిత్. ఆమె బదులు సైఫ్ అలీఖాన్ తనయురాలు సారా అలీ ఖాన్‌ను ఓకే చేశాడతను. దీంతో కియారాకు నిరాశ తప్పలేదు. ‘సింబా’ తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కథాబలమున్న ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్టవుతున్న అంచనాలున్నాయి. ఇలాంటి సినిమాలో కియారాకు ఛాన్స్ దక్కితే ఆమెకు బాగా కలిసొచ్చేదే. కానీ మిస్సయింది.

ఐతే తెలుగులో మాత్రం ఆమె కెరీర్ మంచి ఊపుమీదే ఉంది. మహేష్ తర్వాత రామ్ చరణ్ లాంటి మరో స్టార్ హీరోతో ఆమె జత కడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం హిట్టయితే తెలుగులో కియారా స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు