రేణు కళ్యాణం పవన్‌కి ప్లస్సే

రేణు కళ్యాణం పవన్‌కి ప్లస్సే

రేణు దేశాయ్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటోందని పవన్‌ ఫాన్స్‌లో కొంతమంది తెగ ఇదైపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోక ఫోటోలు గట్రా రిలీజ్‌ చేస్తూ కావాలని రచ్చ చేస్తోందని కొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఫాన్స్‌ మనోభావాల సంగతి ఎలా వున్నా కానీ రేణు ద్వితీయ కళ్యాణం మాత్రం పవన్‌ కళ్యాణ్‌కి రాజకీయంగా కలిసి వచ్చే అంశం. అతని ప్రత్యర్ధులు ప్రతిసారీ తన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేయడం చూస్తూనే వున్నాం. పవన్‌ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ మొదటి భార్య నందిని అసలు ఇప్పుడు ఎక్కడ వుందో, ఏమి చేస్తుందో ఎవరికీ తెలియదు.

రేణు దేశాయ్‌కి పవన్‌ భార్యగా పబ్లిసిటీ ఎక్కువ కనుక ఆమెతో విడిపోయి అన్నాని పెళ్లి చేసుకోవడం పవన్‌కి కాస్త నెగెటివ్‌ ఇమేజ్‌ తెచ్చింది. ఇంతకాలం కనీసం కొందరైనా రేణుకి పవన్‌ అన్యాయం చేసాడనే ఫీలింగ్‌తో వున్నారు. ఆమె ఒంటరిగా వుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, అడపాదడపా ఇంటర్వ్యూల్లో తన కష్టాలు చెప్పుకుంటూ వుంటే పవన్‌కి అది నెగెటివ్‌ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రేణు కూడా మరొక జీవిత భాగస్వామిని చూసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవుతుండడంతో ఇక పవన్‌ ఎవరికో అన్యాయం చేసాడనే గోల వుండదు.

అన్నా, పవన్‌ల మధ్య సఖ్యత, అన్యోన్యత ఎంత అనేది ఇటీవల ప్రతి కార్యక్రమంలో కనిపిస్తూనే వుంది కనుక ఇక పవన్‌ 'కళ్యాణాల' గురించిన టాపిక్‌కి అంత వెయిట్‌ వుండదు. ఇంతకాలం వేచి చూసి సరిగ్గా పవన్‌ రాజకీయాల్లో బిజీ అవుతోన్న టైమ్‌లో రేణు పెళ్లి కబురు చెప్పడం ఖచ్చితంగా పవన్‌కి ప్లస్సే అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు