భారతీయుడు-2కు బ్రేక్ పడ్డట్లే..

భారతీయుడు-2కు బ్రేక్ పడ్డట్లే..

కొన్ని నెలల కిందటే రాజకీయ పార్టీని ప్రకటించాడు కమల్ హాసన్. ఆయన్ని నటుడిగా అభిమానించే వాళ్లకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగతే కమల్ సినిమాలకు టాటా చెప్పేస్తాడన్న ఆందోళన వారిలో ఉంది. ఐతే కమల్ మాత్రం ఇప్పుడిప్పుడూ సినిమాలకు గుడ్ బై చెప్పేలా కనిపించడం లేదు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘విశ్వరూపం-2’ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన ఆయన.. మరో పెండింగ్ మూవీ ‘శభాష్ నాయుడు’ను కూడా పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు ఆనందాన్నిచ్చాడు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్.. వీకెండ్ ఎపిసోడ్లో తన సినీ ప్రణాళికల గురించి కొంంచెం క్లారిటీ ఇచ్చారు.

విశ్వరూపం-2 ఇంతకుముందు ప్రకటించినట్లే ఆగస్టు 10న విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ల హడావుడి అంతా అయ్యాక సెప్టెంబరులో ‘శభాష్ నాయుడు’ చిత్రీకరణ పున:ప్రారంభమవుతుందన్నాడు. కొన్ని నెలల్లోనే ఆ చిత్రం రెడీ చేస్తానన్నాడు. ఐతే కమల్ ‘భారతీయుడు-2’ సంగతి మాత్రం తేల్చలేదు. నిజానికి ఈ చిత్రం ఈపాటికే సెట్స్ మీదికి వెళ్లాల్సింది. కమల్ ఆ సినిమా చేయడానికి రెడీగా కూడా ఉన్నాడు. కానీ ఒక సినిమా పని ముగించాక కానీ తర్వాతి సినిమా మీదికి వెళ్లని మనస్తత్వం శంకర్‌ది. ముందు అనుకున్న ప్రకారం ‘2.0’ రిపబ్లిక్‌ డేకో లేదంటే వేసవికో వచ్చేసి ఉంటే ‘భారతీయుడు-2’ మొదలుపెట్టేసేవాడు. కానీ అనివార్య కారణాలతో ‘2.0’ వాయిదా పడటంతో ఈ సినిమా మొదలుపెట్టలేకపోయాడు.

కమల్ ఇక లాభం లేదని.. ‘శభాష్ నాయుడు’ను పూర్తి చేయడానికి సంసిద్ధుడయ్యాడు. వచ్చే ఏడాది ఎన్నికలుండటంతో కొన్ని నెలల ముందు నుంచే కమల్ రాజకీయాల్లో బిజీ అయిపోతాడు. ‘భారతీయుడు-2’ భారీ సినిమా కావడంతో వర్కింగ్ డేస్ చాలా ఉంటాయి. కాబట్టి కనీసం ఏడాది వరకైతే దాని ఊసు ఎత్తే అవకాశమే లేదు. అప్పటికి శంకర్, కమల్ మూడ్స్ ఎలా ఉంటాయో.. ఈ సినిమాను నిజంగా పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు