మహేష్ మనసు మార్చుకున్నాడా?

మహేష్ మనసు మార్చుకున్నాడా?

రెండు పెద్ద డిజాస్టర్ల తర్వాత ‘భరత్ అనే నేను’తో మళ్లీ ఫామ్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ చిత్ర విజయోత్సాహంలో ఉండగానే తన కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. రెండేళ్ల కిందట్నుంచి చర్చల్లో ఉన్న వంశీ పైడిపల్లి సినిమాకు మహేష్ ఎట్టకేలకు శ్రీకారం చుట్టాడు.

ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ఉత్తరాఖండ్‌లో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి పీవీపీతో గొడవ కూడా సెటిలైపోవడంతో ఇక చకచకా షూటింగ్ చేసేద్దామనుకుంటున్నారు. ముందు ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయంలో ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు సమాచారం.

సంక్రాంతికి కాకుండా వేసవికి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు.. రెండు రోజుల కిందటే వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్లో ‘ఎఫ్-2’ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆ చిత్రం సంక్రాంతికే వస్తుందని ప్రకటించింది చిత్ర బృందం. అది సంక్రాంతికి వస్తే.. మరి మహేష్ సినిమా సంగతేంటి అన్న చర్చ మొదలైంది. ఐతే భారీ బడ్జెట్లో.. పలు లొకేషన్లలో తెరకెక్కాల్సిన మహేష్ సినిమాను సంక్రాంతికి రెడీ చేయడం కష్టమని భావించి వెనక్కి తగ్గారట.

మహేష్‌కు ఇది 25వ సినిమా కావడంతో హడావుడి వద్దని.. సంక్రాంతి టార్గెట్ పెట్టుకుంటే ప్రెజర్ పెరిగిపోతుందని.. క్వాలిటీలో తేడా రావచ్చని.. అందుకే సంక్రాంతి వదిలేసి వేసవికి సినిమాను షెడ్యూల్ చేసుకుంటే ప్రశాంతంగా పని చేసుకోవచ్చని చిత్ర బృందం భావించిందట. మహేష్ కూడా వేసవి విడుదలకే ఓటేసినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు