అల్లువారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారే..

అల్లువారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారే..

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. ట్రెండును మార్చే.. కొత్త ట్రెండ్ సెట్ చేసే ఇలాంటి సినిమాలు దశాబ్దానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి. విజయ్ దేవరకొండ కెరీర్లో మళ్లీ ఇలాంటి సినిమా కానీ.. దాన్ని మించిన సినిమా కానీ వస్తుందా అంటే సందేహమే. ఐతే ‘అర్జున్ రెడ్డి’ వచ్చిన ఏడాదికే విజయ్ నుంచి దాన్ని మించే సినిమా వస్తోందంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఆయన విజయ్‌తో ఒకటికి రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ‘టాక్సీవాలా’ ఇప్పటికే పూర్తయింది. విడుదలకు సిద్ధమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల సినిమా వాయిదా పడింది.

ఈలోపే తన ప్రొడక్షన్లో విజయ్ హీరోగా పరశురామ్ రూపొందిస్తున్న  ‘గీత గోవిందం’ ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడు అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గీత గోవిందం’ విజయ్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అనేశారు. ‘‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. గీతా గోవిందం విజయ్ కెరీర్లో బెస్ట్ ఫిలిం అవుతుందని ధీమాగా చెబుతున్నాను’’ అని అరవింద్ అన్నారు. మరి అందరూ ‘అర్జున్ రెడ్డి’నే విజయ్ కెరీర్ బెస్ట్ ఫిలిం అంటుంటే ‘గీత గోవిందం’ దాన్ని మించే సినిమా అనే చెప్పకనే చెప్పారు అరవింద్. మరి ఈ సినిమా అంత గొప్పగా ఉంటుందేమో చూడాలి. అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్‌కు ‘శ్రీరస్తు శుభమస్తు’తో విజయాన్నందించిన పరశురామ్.. ఇప్పుడు ఆయన బేనర్లోనే బయటి హీరోతో సినిమా తీస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మంధానా కథానాయికగా నటించిన ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు