రణబీర్ ‘మున్నాబాయ్’ వీడియో వైరల్

రణబీర్ ‘మున్నాబాయ్’ వీడియో వైరల్

సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ‘సంజు’ సినిమాలో లీడ్ రోల్‌కు రణబీర్ కపూర్‌ను తీసుకోవాలని దర్శకుడు రాజ్ కుమార్ హిరాని అనుకుంటే.. నిర్మాత విధు వినోద్ చోప్రా తీవ్రంగా వ్యతిరేకించారట. అతడి బదులు రణ్వీర్ సింగ్ అయితే బాగుంటాడని అన్నాడట. కానీ ఇప్పుడు సంజయ్ దత్ పాత్రలో రణబీర్‌ను చూస్తుంటే ఇంకెవరూ ఈ పాత్రను ఇంత బాగా పండించేవాళ్లు కాదేమో అనిపిస్తోంది. సంజయ్ లాగా లుక్ మార్చుకోవడం మాత్రమే కాదు.. అడడిలా నడుస్తూ.. అతడిలా మాట్లాడుతూ.. అతడిలానే హావభావాలు చూపిస్తూ కట్టిపడేస్తున్నాడు రణబీర్. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్లలో రణబీర్ లుక్స్.. ఎక్స్‌ప్రెషన్స్ చూసి జనాలు షాకైపోయారు.

తాజాగా రణబీర్ ఈ సినిమాలో చేసిన ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమాలో సంజయ్ దత్ క్లాస్ రూంలో డీన్‌కు షాకిచ్చే ఒక సీన్‌‌ను.. ‘సంజు’లో రణబీర్ ఇమిటేట్ చేశాడు. అవి రెంటిని మిక్స్ చూసి రూపొందించిన వీడియో చూస్తే షాకైపోవాల్సిందే. అచ్చుగుద్దినట్లు సంజయ్‌లా కనిపిస్తూ.. అతడిలాగే హావభావాలు చూపిస్తూ.. అదే వాయిస్‌లో మాట్లాడుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు రణబీర్. ‘మున్నాభాయ్’లో డీన్‌గా నటించిన బొమన్ ఇరానీనే ఇందులోనూ ఆ పాత్రలో కనిపించడం విశేషం. క్లాస్ రూం సెట్ కూడా అదేలాగా వేశారు. ఈ వీడియో సినిమాపై మరింతగా ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు