సీనియర్ నటుడి కథతో సినిమా

సీనియర్ నటుడి కథతో సినిమా

క్యారెక్టర్ ఆర్టిస్టుగా గత రెండేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్నాడు సీనియర్ నటుడు నరేష్. గత రెండేళ్లలో ఆయనకు అద్భుతమైన పాత్రలు పడ్డాయి. తాజాగా ‘సమ్మోహనం’లో సర్వేష్ పాత్రలో గొప్ప అభినయమే చూపించాడు నరేష్. ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందా పాత్ర. ఈ ఊపులో ఆయనకు మరిన్ని మంచి అవకావాశాలు వస్తున్నాయి. డేట్లు ఖాళీ లేక సినిమాలు వదులుకునే పరిస్థితి కూడా కనిపిస్తుండటం విశేషం. ఆయన పారితోషకం కూడా బాగా పెరిగినట్లుగా వార్తలొస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే.. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా తనలోని వేరే టాలెంట్లను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు నరేష్. ఆయన పేరు త్వరలోనే రచయితగా చూసుకోబోతున్నారట.

తాను ఒక మంచి కథ రాశానని.. అది ఒక యువ దర్శకుడికి నచ్చి తీసుకున్నాడని.. ఆ కథతో త్వరలోనే సినిమా తెరకెక్కబోతోందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు నరేష్. అలాగే సొంతంగా ఒక సినిమా తీయాలని కూడా అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమాకు సీక్వెల్ తీయాలని తనకు బలమైన కోరిక ఉందని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు నిర్మాతగా తాను తీసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయని.. దీంతో మళ్లీ నిర్మాణం గురించి ఆలోచించలేదని.. అప్పట్లో చాలా నైరాశ్యంలో కూరుకుపోయానని నరేష్ చెప్పాడు. ఒక దశలో నిర్మాతలెవరూ తన దగ్గరికి రాకపోవడంతో సినిమాలు పూర్తిగా వదిలేయాలనుకున్నానని.. రాజకీయాల్లోకి వెళ్లానని.. ఆ క్రమంలో చాలా నష్టపోయానని.. ఐతే అదృష్టవశాత్తూ మళ్లీ తన కెరీర్ పుంజుకుని ఇప్పుడు బాగా బిజీ అయిపోయానని నరేష్ తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు