పవన్ పిలిచినా ఎన్టీఆర్ పిలిచినా వెల్తా

పవన్ పిలిచినా ఎన్టీఆర్ పిలిచినా వెల్తా

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు.. కమెడియన్ శ్రీనివాసరెడ్డికి విభేదాలని.. ఒకప్పుడు ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత అతడికి దూరమయ్యాడని.. ఏదో కారణంతో శ్రీనివాసరెడ్డిని తారక్ దూరం పెట్టాడని కొన్ని రోజుల కిందట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

‘అరవింద సమేత’ షూటింగులో కూడా శ్రీనివాసరెడ్డిని ఎన్టీఆర్ దగ్గరికి రానివ్వడం లేదని కూడా గుసగుసలు వినిపించాయి. ఐతే ఈ ప్రచారానికి తెర దించుతూ ఎన్టీఆర్ తో కలిసి ఒక సెల్ఫీ దిగి ట్విట్టర్లో షేర్ చేశాడు శ్రీనివాసరెడ్డి. అంతటితో ఈ డిస్కషన్ ఆగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడాడు శ్రీనివాసరెడ్డి. తనకు ఎన్టీఆర్ కు విభేదాలన్నది శుద్ధ అబద్ధమని.. తమ మధ్య అలాంటిదేమీ లేదని అతను స్పష్టం చేశాడు.

అయినా ఎన్టీఆర్ స్థాయి ఏంటి.. ఆయన నా గురించి ఆలోచించడమేంటి అని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించాడు. ‘‘మనం ‘అ’ దగ్గర ఉంటే.. ఆయన బండి ‘ర’ దగ్గర ఉంటారు. అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి. చాలా గొప్పగా ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తితో నాకు విభేదాలేంటి’’ అని శ్రీనివాసరెడ్డి అన్నాడు. తన గురించి జరుగుతున్న ప్రచారానికి తెరదించాలని కాకుండా.. ఎన్టీఆర్ గురించి తప్పుగా ఆలోచించకూడదనే ‘అరవింద సమేత’ సెట్స్ నుంచి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపాడు.

2009లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేసినపుడు అతడి వెంట శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. మరి ఎన్టీఆర్ మరోసారి ప్రచారానికి వస్తే ఆయన వెంట నడుస్తారా అంటే.. పిలిస్తే తప్పకుండా వెళ్తానన్నాడు. పవన్ కళ్యాణ్ రమ్మన్నా కూడా ఆయన వెంట వెళ్లడానికి తాను సిద్ధమని శ్రీనివాసరెడ్డి ప్రకటించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు