నాగశౌర్య ఆగట్లేదసలు..

నాగశౌర్య ఆగట్లేదసలు..

‘ఛలో’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నాగశౌర్య. వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడితో తన సొంత నిర్మాణ సంస్థలో చేసిన ఈ సినిమాతో శౌర్య మంచి ఫలితాన్నందుకున్నాడు. ఆ తర్వాత అతను వరుసగా కొత్త దర్శకుల్నే నమ్ముతున్నాడు. తన సొంత బేనర్లలోనే శ్రీనివాస్ అనే మరో కొత్త దర్శకుడితో ‘నర్తన శాల’ అనే మరో సినిమాలో అతను నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా శౌర్య మరో కొత్త సినిమామొదలుపెట్టాడు. ఇది కూడా ఒక నూతన దర్శకుడు రూపొందించబోయేదే. ఆ దర్శకుడి పేరు రాజా కొలుసు. ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ ‘భవ్య క్రియేషన్స్’ బేనర్ మీద ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ‘ఛలో’తో ఆకట్టుకున్న మణిశర్మ తనయుడు మహత్ స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తాడు. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం సమకూరుస్తాడు.

శౌర్య ఇప్పటికే చాలామంది కొత్త దర్శకులతో పని చేశాడు. అతడికి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టిన ‘ఊహలు గుసగుసలాడే’కు కూడా కొత్త దర్శకుడైన అవసరాల శ్రీనివాసే దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్యా’తో త్రికోఠి అనే మరో డెబ్యూ డైరెక్టర్‌తో పని చేశాడు. ఇటీవలే విడుదలైన ‘అమ్మమ్మగారిల్లు’ను తీసింది కూడా కొత్త దర్శకుడైన సుందర్ సూర్యానే.

ఇప్పుడు నాగశౌర్య మొదలుపెట్టిన సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న సాయిశ్రీరామ్‌తోనూ శౌర్య ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి పని చేసే అవకాశముంది. గత ఏడాది ‘పైసా వసూల్’తో ఎదురు దెబ్బ తిన్న ఆనంద్ ప్రసాద్.. ఈసారి తక్కువ బడ్జెట్లో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవీలే ఆయన రామ్-ప్రవీణ్ సత్తారు సినిమాను మొదలుపెట్టబోయే వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు