రానా ‘అరణ్య’ కథేంటంటే..

రానా ‘అరణ్య’ కథేంటంటే..

‘బాహుబలి’ సినిమాతో దగ్గుబాటి రానా రేంజే మారిపోయింది. దాని కంటే ముందే ‘బేబీ’తో అతడికి బాలీవుడ్లో మంచి పేరు వచ్చింది. ఆపై ‘ఘాజీ’ కూడా అతడి మార్కెట్‌ను విస్తరించింది. తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లోనూ రానా ఫేమస్ అయ్యాడు. అతడిని హీరోగా పెట్టుకుంటే మూడు భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసుకునే సౌలభ్యం లభిస్తోంది. అతడి కథలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటున్నాయి. ప్రస్తుతం రానా ఒక త్రిభాషా చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో ‘అరణ్య’ అనే పేరు పెట్టారు. హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. తమిళంలో ‘కాడన్’ పేరుతో ఈ సినిమా తీస్తున్నారు. ఈ చిత్ర కథేంటన్నది ప్రభు సాల్మన్ ఒక ఇంటర్వ్యూలో విప్పేయడం విశేషం.

అటవీ నేపథ్యంలో సినిమాలు తీయడంలో ప్రభు సాల్మన్ సిద్ధహస్తుడు. ఇంతకుముందు అతను ‘గజరాజు’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. అందులో ఒక ఏనుగు.. దాని మావటివాడు.. ఓ అమ్మాయి.. ఈ ముగ్గురి చుట్టూ కథ సాగుతుంది. మావటి వాడు.. ఏనుగు మధ్య అనుబంధాన్ని గొప్పగా చూపించాడు ప్రభు అందులో. ‘అరణ్య’లో సైతం ఏనుగుల చుట్టూ కథ సాగుతుందట. మనుషులకు.. ఏనుగులకు మధ్య పోరాటాన్ని ఇందులో చూపిస్తారట. మనుషుల అనాలోచిత చర్యల వల్ల అనాథలుగా మారిన 20 ఏనుగుల్ని చేరదీసి వాటి బాగోగులు చూసే అడవి మనిషిగా  రానా కనిపిస్తాడట. జంతువులతో రానా అనుబంధాన్ని చూపిస్తూ మనుషులతో అతను చేసే పోరాటాన్ని ఇందులో చూపించనున్నాడట ప్రభు. ఈ చిత్రానికి రానా తండ్రి సురేష్ ఒక నిర్మాత కావడం విశేషం. వేర్వేరు భాషల్లో వేర్వేరు నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు