ధనుష్ సినిమా రేంజే వేరు

ధనుష్ సినిమా రేంజే వేరు

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి.. చిన్న సినిమాలతోనే తనదైన ముద్ర వేసి.. నటుడిగా గొప్ప పేరు తెచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగాడు ధనుష్. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడయ్యాక అతడి రేంజ్ మరింత పెరిగింది. ఐతే రజనీ అల్లుడిగా కంటే గొప్ప నటుడిగానే అతడికి గుర్తింపు ఉంది. ధనుష్ నుంచి ఓ సినిమా వస్తోందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని.. అతడి పాత్ర ఆషామాషీగా ఉండదని ప్రేక్షకుల్లో ఒక నమ్మకముంది. తమిళంతో పాటు తెలుగు.. హిందీ భాషల్లోనూ అంత మంచి గుర్తింపు సంపాదించాడీ బక్క హీరో. ఐతే ‘వీఐపీ’ (తెలుగులో రఘువరన్ బీటెక్) తర్వాత ధనుష్ నుంచి అతడి స్థాయికి తగ్గ సినిమా రాలేదు. ఈ మధ్య కాలంలో అతను చేసిన మూడు సినిమాలన్నీ నిరాశ పరుస్తున్నాయి.

దీంతో ఇప్పుడు ధనుష్ ఆశలన్నీ ఒక స్పెషల్ మూవీ మీద నిలిచాయి. అదే.. వడ చెన్నై. ఇంతకుముందు ధనుష్ కథానాయకుడిగా ‘పొల్లాదవన్’.. ‘ఆడుగళం’ సినిమాలు తీసిన వెట్రిమారన్ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ‘ఆడుగళం’తో ధనుష్‌కు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టిన వెట్రిమారన్.. ఆ తర్వాత గత ఏడెనిమిదేళ్లలో ఒకే ఒక్క సినిమా చేశాడు. అదే.. విసారణై. ఈ చిత్రం కూడా జాతీయ అవార్డు అందుకుంది. ఆస్కార్ అవార్డులకు ఇండియన్ ఎంట్రీగా వెళ్లింది. ఆ సినిమా కంటే ముందు నుంచే ‘వడ చెన్నై’ కోసం పని చేస్తున్నాడు వెట్రిమారన్. ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ స్క్రిప్టులో కూడా పాలుపంచుకున్నాడు.

వీళ్లిద్దరూ ఈ సినిమా పనిని ఒక యజ్ఞం లాగా భావించి కొన్నేళ్లుగా దీని మీద పని చేస్తున్నారు. దీన్ని ఒక సినిమాగా తీయాలనుకోవట్లేదు. మూడు భాగాలుగా చేస్తుండటం విశేషం. బడ్జెట్ కూడా భారీగానే కేటాయించారు. చెన్నైలో రౌడీయిజానికి పెట్టింది పేరైన ఓ ప్రాంతం నేపథ్యంలో అక్కడి పరిస్థితుల్ని.. మనుషుల్ని లోతుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు వెట్రిమారన్, ధనుష్. తమిళ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయేలా ‘వడ చెన్నై’ని తీర్చిదిద్దుతున్నట్లుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. జులై 28న ధనుష్ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. సెప్టెంబరులో తొలి భాగం విడుదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు