‘క్షణం’ తర్వాత ‘దొరసాని’

‘క్షణం’ తర్వాత ‘దొరసాని’

‘క్షణం’ సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోయింది. అలాంటి అదరిపోయే థ్రిల్లర్ తీసిన దర్శకుడు రవికాంత్ పేరెపు ఇప్పటిదాకా ఇంకో సినిమా మొదలుపెట్టలేదు. మధ్యలో రానా దగ్గుబాటి హీరోగా ఒక సినిమా మొదలుపెడతాడని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత దాని గురించి అప్ డేట్ లేదు. ఏడాది నుంచి అసలు రవికాంత్ పేరే ఎక్కడా వినిపించట్లేదు. అంత టాలెంటుండి ఇలా అయిపోయాడేంటని అనుకుంటున్నారు జనాలు అతడి గురించి. ఐతే ఎట్టకేలకు రవికాంత్‌కు ఒక సినిమా ఓకే అయింది. కొత్త టాలెంట్ ఎక్కడ కనిపించినా పట్టుకొచ్చి సినిమాలు చేయడం అలవాటైన అగ్ర నిర్మాత సురేష్ బాబు రవికాంత్‌తో సినిమా చేయబోతుండటం విశేషం. అది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ అట. ఆ చిత్రానికి ‘దొరసాని’ అనే పేరు కూడా ఖరారు చేశారు.

తన ప్రొడక్షన్లో వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రమోషన్లలో భాగంగా తన కొత్త ప్రాజెక్టుల గురించి సురేష్ వెల్లడించారు. అందులో భాగంగానే ‘దొరసాని’ గురించి వెల్లడించారు. మరి పెద్ద బేనర్లో అవకాశం దక్కించుకున్న రవికాంత్ ఎలాంటి సినిమా చేస్తాడో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇందులో నటించే నటీనటులెవరో సురేష్ చెప్పలేదు. దీంతో పాటుగా సురేష్ బాబు తన కొడుకు రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘అరణ్య’లో తాను కూడా నిర్మాణ భాగస్వామినని వెల్లడించారు. మరోవైపు విక్టరీ వెంకటేష్-అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో బాబీ దర్శకుడిగా ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. కొంత కాలంగా చిన్న సినిమాలకే పరిమితం అవుతున్న సురేష్.. ఇకపై వరుసగా పెద్ద సినిమాలు చేయబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు