కొత్త సినిమా.. భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు

కొత్త సినిమా.. భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు

కమెడియన్‌గా చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చే కామెడీ పాత్రలతో మెప్పించి.. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరికి హీరోగా మారాడు శ్రీనివాసరెడ్డి. ముందు ఇతను హీరో ఏంటి అన్నవాళ్లు కూడా కథానాయకుడిగా అతను చేసిన ‘గీతాంజలి’.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’.. ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలు చూసి ముక్కున వేలేసుకున్నారు.

హీరోయిజం కోసం వెంపర్లాడకుండా కథల్లో కలిసిపోయే పాత్రలతో మెప్పించాడు. తన అభిరుచిని చాటుకున్నాడు శ్రీనివాసరెడ్డి. ఇప్పుడతను ‘జంబలకిడి పంబ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంపైనా నమ్మకంగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. త్వరలోనే ఒక ఆసక్తికరమైన సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. ఆ సినిమా పేరు.. ‘భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు’ అట.

ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర సంగతులు చెప్పాడు శ్రీనివాసరెడ్డి. ఇది తెలుగులో ప్రస్తుతమున్న ప్రముఖ కమెడియన్లు కలిసి నిర్మించబోయే సినిమా అట. 13 మంది కమెడియన్లు కలిసి ‘ఫ్లయింగ్ కలర్స్’ అని ఒక గ్రూప్ పెట్టారట. త్వరలోనే ఈ 13 మంది కలిసి ఒక నిర్మాణ సంస్థ కూడా మొదలుపెడుతున్నారట. ఆ సంస్థ మీదే ‘భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు’ అనే సినిమా తీయబోతున్నారట.

అందులో తనతో పాటు ఈ కమెడియన్లందరూ నటిస్తారని.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. అలాగే  తాను హీరోగా శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా పట్టాలెక్కబోతోందని కూడా అతను తెలిపాడు. ఇక కమెడియన్‌గా ప్రస్తుతం తాను ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘ఎఫ్‌2’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘పంతం’, ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించాడు శ్రీనివాసరెడ్డి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు